Woman Successfully Running Business with other Women : యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మంజుల 2017 నుంచి సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ఒంటరి మహిళగా తమ జీవితాన్ని పునఃప్రారంభించింది. అంతక ముందు భర్తతో పాటు అత్తమామలను కోల్పోయి పుట్టెడు దుఖంతో నరకయాతన అనుభవించింది. ఇలాగే ఉంటే తమ జీవితాన్ని తన పిల్లల భవిష్యత్తు అంధకారంలో మిగిలిపోతుందని ఆలోచించి సొంత వ్యాపారాన్ని ప్రారంభించింది. కరోనా విపత్కర సమయంలో డ్రైఫ్రూట్స్ వ్యాపారంతో మెుదలు పెట్టింది. దాంతో సంతృప్తి చెందని మంజుల, తమ వంతు సాయంగా పర్యావరణాన్ని పరిరక్షించడానికి జూట్ బ్యాగుల తయారీ వైపు అడుగులు వేసింది.
ప్రస్తుతం 10 మందికి ఉపాధినిస్తూ నెలకి వేలల్లో ఆదాయం సంపాదిస్తోంది. తొలుత ఇంట్లో ఒంటరిగా ప్రారంభించిన జూట్ వ్యాపారం, నేడు 10 మందితో రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతోంది. ఈ వ్యాపారంలో మహిళలకు ప్రోత్సాహంతో పాటు ఒంటరి మహిళలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ వారికి ఉపాధి అవకాశాన్ని కల్పిసోంది. వచ్చిన ఆదాయంలో కొంత అనాథ పిల్లలను చదివించడాని ఉపయోగిస్తున్నారు మంజుల. ప్లాస్టిక్ నిర్మూలనే లక్ష్యంగా ఈ జూట్ బ్యాగులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరిస్తున్నారు. తమ కుమారుడి మాదిరిగా ఇంకా ఏ పిల్లలు కూడా అనారోగ్యపాలు కాకూడదని మంజుల ఆకాంక్షిస్తున్నారు.
'గజ్వేల్‌కు 2017లో వచ్చా. కరోనా సమయంలో డ్రైఫ్రూట్స్ వ్యాపారం చేశా. డ్రైఫ్రూట్స్ వ్యాపారం వల్ల నలుగురికే ఉపాధి వస్తోందని, జూట్ వ్యాపారాన్ని ప్రారంభించా. పర్యావరణాన్ని పరిరక్షించడానికి లక్ష్యంగా జూట్ వ్యాపారం చేస్తున్నా. తొమ్మిది మందితో ఇంట్లోనే ప్రారంభించా. ఒక్కరోజులో 2500 బ్యాకులు మార్కెట్‌కు వెళుతున్నాయి'- మంజుల, జాట్ వ్యాపార యజమాని
ఆనాడు తినడానికి తిండి లేని పరిస్థితి నుంచి నేడు పదిమందికి అన్నం పెట్టగలుగుతున్నాను అంటే చాలా సంతోషంగా ఉందని చెబుతున్నారు మంజుల. వచ్చే లాభాలను పూర్తిగా సొంతంగా వినియోగించుకోకుండా చిన్నారులతోపాటు అనేక మంది విద్యార్థులను చదివించడానికి చాలా సంతోషంగా ఉందని మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో భర్తని కోల్పోయిన మహిళలకు మంజుల జీవితం ఓ స్ఫూర్తినిస్తోంది. సర్వం కోల్పోయం అన్న స్థితి నుంచి నలుగురికి అండగా నిలిచే స్థాయికి ఎదిగింది. పోరాట ప్రతిమ ఉంటే ఎంతటి కష్టమైన మహిళ ముందు తలవంచక తప్పదని నిరూపించింది.