Whip Adluri Laxman Road Accident : ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు (Whip Adluri Laxman) ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం బోల్తా కొట్టింది. ఘటన జరిగిన సమయంలో కారులో ఉన్న లక్ష్మణ్ కుమార్ సహా ఇతరులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన కరీంనగర్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మెరుగైన చికిత్స కోసం ఎమ్మెల్యేను హైదరాబాద్ తరలించారు ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. కారులో ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి ధర్మపురి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
"ఈరోజు తెల్లవారుజామున ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్ నుంచి ధర్మపురికి వస్తున్నారి. వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబారీపేట వద్దకు రాగానే ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనం బోల్తా కొట్టింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఎమ్మెల్యేను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం వారిని హైదరాబాద్‌కు తరలించారు." - రాజ నరసింహారెడ్డి, ధర్మపురి సీఐ
అల్వాల్లో దూసుకొచ్చిన డీసీఎం - కన్నతల్లి ముందే బాలుడి దుర్మరణం