IMD Alerts Meanings in Weather : నైరుతి రుతుపవనాలు తిరోగమన దశలో ఉండగా, ఈశాన్య మాన్సూన్స్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఈ సమయంలో సముద్ర ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే కారణంగా ఏటా అక్టోబరు, నవంబరు నెలల్లో బంగాళాఖాతంలో తుపాన్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. అల్పపీడనాలు కాస్త క్రమంగా హెచ్చుతగ్గులకు లోనపుతూ వాయుగుండాలు, తుపాన్లుగా పరిణామం చెందుతాయి. ఈ పరిస్థితుల్లో మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఏర్పడుతుంది. గత దశాబ్దంలో హిందూ మహాసముద్రానికి ఆనుకుని ఉన్న బంగాళాఖాతంలో అక్టోబరు-డిసెంబరు మధ్యకాలంలో 11 తుపాన్లు ఏర్పడగా, అందులో 6 ఆంధ్రాలోనే తీరం దాటి విధ్వంసం సృష్టించాయి.
ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడగా అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఐఎండీ వర్షం, గాలుల తీవ్రత ఆధారంగా హెచ్చరికలు జారీ చేస్తుంది. వర్షపాతం, గాలిలో వేగం తీవ్రత ఆధారంగా అవి గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ చేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వాలను వాతావరణ శాఖ అప్రమత్తం చేస్తుంది.
వర్షపాతాన్ని ఎలా లెక్కిస్తారు?
ఏ ప్రాంతంలోనైనా వర్షం కురిస్తే ఆ ఏరియాలోని సమతలంపై నీరు ఎంత ఎత్తుకు చేరుకుంటుందో ఆ మట్టం ఆధారంగా అక్కడ కురిసిన వర్షపాతాన్ని లెక్కిస్తారు. ఇలా కొలవడానికి ప్రధానంగా రెయిన్ గేజ్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు. ఈ గేజ్‌లో పడిన వర్షపు నీరు నిల్వ చేయబడుతుంది. ఆ నీటి స్థాయిని కొలిచి మిల్లీమీటర్లలో వర్షపాతం ఎంత అని లెక్కిస్తారు.
రెయిన్ గేజ్‌లు రెండు రకాలు :
సాధారణ రెయిన్ గేజ్ : ఇది ఒక సాధారణ కంటైనర్ లాంటిది. పడిన వర్షం ఈ కంటైనర్‌లో నిల్వ ఉంటుంది. ఆ నీటిని కొలిచి వర్షపాతం లెక్కకడతారు.
రికార్డింగ్ రెయిన్ గేజ్ : ఇది ఆటోమేటిక్‌గా వర్షపాతాన్ని రికార్డ్ చేసే టూల్. ఇది వర్షం పడిన టైం, వర్షపాతం మొత్తం వంటి వివరాలను రికార్డ్ చేస్తుంది.
ఐఎండీ ఇచ్చే ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్‌లకు అర్థం ఏమిటి ?
- గ్రీన్ అలర్ట్ (Green Alert) : ఏదైనా ఒక ప్రదేశంలో 24 గంటల వ్యవధిలో 6.4సెంటీ మీటర్ల కంటే తక్కువ వర్షం కురిసే అవకాశం ఉంటే ఐఎండీ అధికారులు ఈ అలర్ట్ జారీ చేస్తారు. వాతావరణంలో రాబోయే మార్పుల గురించి ఈ హెచ్చరిక తెలియజేస్తుంది. అయితే తక్కువ వర్ష పాతం నమోదయ్యే అవకాశాలున్నందున ఈ అలర్ట్ ద్వారా స్పెషల్‌గా హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం ఉండదు.
- ఎల్లో అలర్ట్ (Yellow Alert) : ఒక ప్రదేశంలో 6.45 సెంటీ మీటర్ల నుంచి 11.55 సెంటీ మీటర్ల మధ్య వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయనే సమాచారం, అంచనాల మేరకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ అలర్ట్ జారీ చేశారంటే ప్రెజెంట్ వాతావరణం ప్రతి కూలంగా మారుతుందని అర్థం. దాదాపు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే పరిస్థితి నెలకొంటుంది. మోస్తరు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఏర్పడుతుంది. వరద ఉప్పొంగే ప్రమాదం ఉంటుంది కాబట్టి పరిస్థితిని జాగ్రత్తగా గమనించాలని అధికార యంత్రాంగానికి ఈ అలర్ట్ ద్వారా సూచిస్తారు.
- ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) : 24 గంటల వ్యవధిలో 11.56 సెంటీమీటర్ల నుంచి 20.44 సెంటీ మీటర్ల మధ్య వర్షం కురవొచ్చన్న అంచనాతో ఐఎండీ ఈ ఆరెంజ్ హెచ్చరికను జారీ చేస్తుంది. ఈ సమయంలో గాలుల తీవ్రత 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంగా వీస్తాయి. వాతావరణ పరిస్థితులు అల్లకల్లోలంగా ఉండే ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు వరద ప్రభావిత లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షితంగా తరలిస్తారు. ఈ ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యిందంటే ఇంక వరద ముప్పు పొంచి ఉన్నదనే అలర్ట్ వచ్చినట్టే.
- రెడ్ అలర్ట్ (Red Alert) : వాతావరణం, వర్షపాతానికి సంబంధించి ఇది చివరి హెచ్చరికగా పరిగణించవచ్చు. 24 గంటల వ్యవధిలో ఒక ఏరియాలో 20.45 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే వీలుంటే వాతావరణ శాఖ దీన్ని జారీ చేసి ప్రభుత్వాలను హెచ్చరిస్తుంది. ఈ ప్రమాద హెచ్చరిక అత్యంత ప్రతి కూల వాతావరణ పరిస్థితులకు సంబంధించిందిగా చెప్పవచ్చు. ఈ సమయంలో విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతోపాటు రోడ్లపైకి వరద పోటెత్తడం, ట్రాన్స్పోర్ట్, వాహనాల రాకపోకలకు అంతరాయం ఉంటుంది. పౌరుల ప్రాణాలకు అపాయం ఉందన్న అంచనాల నేపథ్యంలో ఐఎండీ ఈ తరహా హెచ్చరికలు జారీ చేస్తుంది. దీంతో విపత్తు నిర్వహణా దళాలు, ఐఎండీ టీమ్‌లు, రెస్క్యూ సహాయక సిబ్బందితో పాటు స్థానిక రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ సాయుధ బలగాలు అప్రమత్తంగా ఉంటాయి. ఈ రెడ్ అలర్ట్ జారీ అయితే దాదాపు ఐదు రోజుల పాటు అమల్లో ఉంటాయి.
బంగాళాఖాతంలో అల్పపీడనం - భారీవర్షాలతో బిక్కుబిక్కుమంటున్న కోస్తా జిల్లాలు