Earth Under Threat : ఈ ప్రపంచంలో ఎన్నో గ్రహాలు ఉన్నా మనిషి అనే జీవి బతకడానికి ఉన్నది మాత్రం ప్రస్తుతానికి భూమి ఒక్కటే. అలాంటి ఆధారానికి ఎన్ని రకాలుగా కీడు చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నాం. ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో సహజ వనరుల వినియోగం అదుపు తప్పడంతో భూమి నుంచి విచ్చలవిడిగా ఖనిజాల వెలికితీత కొనసాగుతోంది. పెరిగిన జనాభా అవసరాలతో పాటు అటవీప్రాంతం కోత, తీర వ్యవస్థల విధ్వంసంతో పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటోంది. మానవాళి స్వయంగా చేసే అపరాధాల వల్ల పీల్చే గాలి, తాగే నీరు, పండించే నేల తీవ్ర కాలుష్యానికి గురవుతున్నాయి. భూగోళ పరిరక్షణే లక్ష్యంగా అవగాహన ముమ్మరం చేసేందుకు ప్రపంచ దేశాల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా ప్లాస్టిక్ వినియోగం కారణంగా తలెత్తుతున్న దుష్ప్రభావాలు, వాడకాన్ని గణనీయంగా తగ్గించాల్సిన అవసరంపై ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నారు. అయినా మనలో మాత్రం మార్పు రావడం లేదు.
వాతావరణ మార్పుల దుష్ప్రభావాలతో భూతాపం నానాటికి పెరిగిపోతుంది. అధిక ఉష్ణోగ్రతలు, కార్చిచ్చులు, తుపానులు, వరదలు, కరవు కాటకాలు వంటి విపత్తులు తీవ్రరూపం దాల్చి దాడి చేస్తున్నాయి. పరిశ్రమలు, జనావాసాల నుంచి విడుదలయ్యే కాలుష్య వ్యర్థ జలాలు సముద్రాలు, నదుల్లో కలిసి ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. వందేళ్లలో సగం దాకా చిత్తడి నేలలు, పగడపు దిబ్బలు కనుమరుగైయ్యాయి. ప్రకృతి సమతుల్యత దెబ్బతినడంతో వాయుకాలుష్యం పెరిగిపోయింది. భూతాపాన్ని నియంత్రించాలని ప్రపంచ దేశాలు తీర్మానించి దశాబ్దం గడుస్తున్నా కార్యాచరణకు నోచుకోకపోవడం విచారకరం. భూతాపం పెరగడం వల్ల ధ్రువ ప్రాంతాల్లో మంచుకొండలు వేగంగా కరిగిపోయి సముద్రమట్టాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ ప్రభావంతో సముద్ర తీర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు తీవ్ర ముప్పును ఎదుర్కొనే దుస్థితి నెలకొంది. ఇదే విషయాన్ని పలు అధ్యయనాలు పేర్కొనడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
ప్లాస్టిక్ ఉత్పత్తులను 60 శాతం మేర తగ్గించాలి : ఈ ఏడాది ధరిత్రీ దినోత్సవం సందర్భంగా ప్రపంచ దేశాలు 2040 నాటికి అన్ని రకాల ప్లాస్టిక్ ఉత్పత్తుల్ని 60శాతం మేర తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అమలులో చిత్తశుద్ధి కనబరిస్తేనే మెరుగైన ఫలితాలు దక్కుతాయి. కొన్ని దశాబ్దాలుగా విపరీతంగా పెరిగిపోయిన ప్లాస్టిక్ వినియోగం ప్రకృతి వ్యవస్థలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోంది. ప్రజల జీవనశైలి, సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన పెనుమార్పుల వల్ల ప్లాస్టిక్ వినియోగం ఊహించని విధంగా పెరిగిపోయింది. పలుప్లాస్టిక్ పదార్థాల వినియోగం, ఉత్పత్తులపై నిషేధం, నియంత్రణ అమలూ సవాలుగా మారింది. భూగోళంపై ఏటా 80 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో పేరుకుని ప్రకృతి వ్యవస్థలు, జలచరాలు, ప్రజల ఆరోగ్యంపైనా తీవ్ర దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి. భారత్‌లో ప్రధాన నదులు, ఉపనదులు ఇరవై శాతం మేర ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రంలోకి విడిచే వాహకాలుగా మారడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ప్రస్తుత ప్లాస్టిక్ ఉత్పత్తి, పునర్వినియోగం విధానాల్లో సత్వరమే మార్పులు చోటుచేసుకోక పోతే పదేళ్లలో 30కోట్ల టన్నుల మేర ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో పోగుపడే ప్రమాదం ఉంది. సూక్ష్మ ప్లాస్టిక్ పదార్థాలు మరింత ప్రమాదకరంగా పరిణమించాయి. వీటి ఉత్పాదన నుంచి వినియోగం వరకు విధిస్తున్న నిషేధం చిత్తశుద్ధితో అమలు జరగాలి. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ వస్తువులు ప్రజలకు అందుబాటులో లభించేలా వ్యవస్థల బలోపేతానికి ప్రభుత్వాలు కృషి చేయాలి. ప్లాస్టిక్ వ్యర్థాలను వేగంగా క్షీణింపజేసే పదార్థాల అన్వేషణ, పరిశోధనలపై దృష్టి పెంచాల్సిన అవసరం ఉందంటున్నారు పర్యావరణ నిపుణులు.
ప్రపంచ దేశాలు కలిసి ముందుకు రావాలి : భూగోళానికి పొంచిన అనర్థాలు నియంత్రించేందుకు పర్యావరణ హితకరమైన విధానాల అమలుతో ప్రపంచదేశాలు కలిసికట్టుగా ముందుకు వెళ్లడం చాలా అవసరం. పారిస్ ఒప్పందంలో భాగంగా కర్బన ఉద్గారాల నియంత్రణపై ఇచ్చిన హామీల అమలు కార్యాచరణను వేగవంతం చేయాలి. సంపన్న దేశాలు వెనకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రజల ఆహార భద్రత, ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యమివ్వాలి. దేశాలన్నీ పెట్రోలు, డీజిల్, బొగ్గు వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించాలి.
అడవుల కోతకు అడ్డుకట్ట వేసి, కార్చిచ్చులను నియంత్రించడంపై దృష్టి సారించాలి. కాలుష్యం, అడవుల కోతవంటి అంశాల్లో వివిధ పర్యావరణ విధానాలు, చట్టాల పటిష్ఠ అమలుకు పూనుకొని, ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేయాలి. అడవులను అటవీయేతర కార్యక్రమాలకు బదలాయిస్తూ ప్రత్యామ్నాయంగా చేపడుతున్న వనాల పెంపకం చిత్తశుద్ధితో జరగాలని పర్యావరణ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
వాతావరణ మార్పులు ఎదుర్కొనేందుకు చర్యలు : భారత్‌లో అప్పుడప్పుడు అకస్మాత్తుగా తలెత్తే వరదలతో ముంబయి, చెన్నై, హైదరాబాద్ వంటి పెద్ద నగరాలూ జలమయం అవుతున్నాయి. కొన్ని తరచూ తీవ్ర నీటిఎద్దడి ఎదుర్కొంటున్నాయి. అయితే దేశంలో పెద్ద నగరాలకు సంబంధించి వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనే ప్రణాళికలు ప్రభుత్వాలు రూపొందించాయి. కానీ, అమలు చేయక పోవడంతో ఈ తరహా దుర్భర పరిస్థితులు పెరుగుతున్నాయి. వాతావరణ మార్పులు, పర్యావరణం, తీరప్రాంతాలు, చిత్తడి, మడ అడవుల పరిరక్షణ వంటి సున్నితమైన పర్యావరణ అంశాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలి. ప్రజల జీవనశైలి పర్యావరణహితకరంగా సాగేలా నీరు, విద్యుత్, ఇంధనం, ఖనిజాలు తదితర వనరుల వినియోగంలో పొదుపు అవసరం. ధరిత్రీ పరిరక్షణలో అందరూ భాగస్వాములై భావితరాల మనుగడకు, జీవన భద్రతకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది.
భూమిపై జీవవైవిధ్యాన్ని రక్షించడంలో అడవుల పాత్ర కీలకం. కర్బన ఉద్గారాలను గ్రహించడం ద్వారా వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను నియంత్రించేందుకు దోహద పడతాయి. అటవీ వనరుల సేకరణ ద్వారా కోట్ల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. వేగంగా సాగుతున్న నగరాల విస్తరణ, ఖనిజ తవ్వకాలు, ఉష్ణోగ్రతల పెరుగుదల, కార్చిచ్చులు, అడవుల రక్షణకు సవాలుగా మారుతున్నాయి. అడవుల తగ్గుదల మూలంగా అరుదైన జీవుల మనుగడసైతం ప్రమాదంలో పడుతోంది. భారత్‌లో అటవీ వనాల పరిరక్షణ, పెంపకానికి కృషి జరుగుతున్నా కార్యాచరణలో మాత్రం చిత్తశుద్ధి కనబరచడం లేదన్న విమర్శలున్నాయి. ఇక్కడ ఒక్క విషయం చాలా సుస్పష్టం. మనం చెట్లను కాపాడితేనే అవి మనల్ని రక్షిస్తాయనే నగ్నసత్యాన్ని గుర్తించే ప్రపంచానికి మేలు జరుగుతుంది.
వర్షపు నీటిని ఒడిసిపడదాం.. కరవు నుంచి బయటపడదాం - RAIN WATER HARVESTING IN HYDERABAD