Water Supply For Forest Animals In TS : వేసవి సమీపిస్తున్న తరుణంలో రోజురోజుకూ భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. కొన్ని గ్రామాల్లో ప్రజలు సూదూర ప్రాంతాలకు వెళ్లి బిందెలతో నీళ్లు తెచ్చుకుంటున్నారు. సాగునీరందక కొన్ని ప్రాంతాల్లో పంటలకు సైతం ఎండిపోతున్నాయి. మనుషులే ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ఇక అడవుల్లో మూగజీవాల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. దీంతో మెదక్ జిల్లా నర్సాపూర్ అటవీ శాఖ అధికారులు ముందు చర్యలు చేపట్టారు. అడవిలో నీటి కుంటలు, చెక్ డ్యామ్‌లు నిర్మించి సౌర పంపుసెట్ల ద్వారా వన్యప్రాణుల దాహార్తి తీరుస్తున్నారు.
Forest Department Setup Check Dams : మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రాంతంలో 11వేల 700 హెక్టార్లల్లో అటవీ ప్రాంతం ఉంది. ఇక్కడ కోతులు, ఎలుగుబంట్లు, కొండ గొర్రెలు, కుందేళ్లు వంటి వన్య ప్రాణులు ఉన్నాయి. సాధారణ రోజుల్లో అడవిలో నీటి సమస్య ఉండదు. కానీ వేసవి వేళ జంతువులు ఇబ్బందులు పడుతుంటాయి. కొన్నిసార్లు అడవిదాటి బయటకి వెళ్లే అవకాశమూ ఉంటుంది. ఈ నేపథ్యంలో వన్యప్రాణుల రక్షణ కోసం అటవీ అధికారులు వినూత్న చర్యలు చేపట్టారు. అడవి జంతువులు బయటకు వెళ్లి వేటగాళ్ల ఉచ్చులో చిక్కకుండా , రోడ్డు దాటుతూ ప్రమాదాలకు గరికాకుండా వాటి దాహార్తిని తీర్చడానికి శాశ్వత చర్యలు చేపట్టారు.
"నర్సాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో 22 బ్లాక్‌లు ఉన్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం వీటిలో సోలార్ పంప్‌లను ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా వణ్యప్రాణులు బయటకు వెళ్లకుండా అడవిలోనే దాహార్తిని తీర్చుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇచ్చట కొండగొర్రెలు, దుప్పిలు, చిరుతలు ఇలాంటి ఎన్నో వన్యప్రాణలు ఉన్నాయి" - బి.అంబర్ సింగ్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
మెదక్‌లో అందమైన అరణ్యం - వీకెండ్స్‌కి మంచి టూరిస్ట్ స్పాట్
మూగజీవాల దాహర్తిని తీర్చేందుకు అటవీ అధికారుల చర్యల
అటవీ ప్రాంతంలో అక్కడక్కడా సోలార్ పంపుసెట్లు అమర్చి నీటికుంటలు, చెక్‌డ్యామ్‌లను ఏర్పాటు చేశారు. నర్సాపూర్ అటవీ కార్యాలయం పరిధిలోని మేడంబండ, ఎల్లాపూర్, శివ్వంపేట, మగ్ధంపూర్ అటవీ ప్రాంతాల్లో ఈ సోలార్ పంపు సెట్లను నెలకొల్పారు. వీటి ద్వారా ప్రతిరోజూ చెక్‌డ్యామ్, కుంటల్లో నీటిని నింపుతున్నారు. ఈ నీటి కుంటల వద్దకు వన్యప్రాణులు చేరుకుని దాహార్తిని తీర్చుకుంటున్నాయి. నర్సాపూర్ అటవీ ప్రాంతంలో ప్రస్తుతం ఆరు పంపుసెట్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మరికొన్ని సోలార్ పంపుసెట్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు చెబుతున్నారు. వేసవిలో మాత్రమే ఈ పంపుసెట్లను వీటిని వినియోగిస్తూ వన్యప్రాణుల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని అటవీ అధికారులు తెలిపారు. మూగ జీవాల దాహార్తిని తీర్చేందుకు అటవీ అధికారులు చేపడుతున్న చర్యలపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
స్మగ్లర్లపై కఠిన చర్యల కోసం పీడీ యాక్ట్ పెట్టాలి : కొండా సురేఖ