Water scarcity for Crops in Nalgonda District : రాష్ట్రంలోని జలాశయాల్లో నీటిమట్టాలు అడుగంటుతున్నాయి. ఎండల తీవ్రత పెరగడం సహా ఎగువ నుంచి సన్నని ధార కూడా రావడం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధానంగా సాగర్ ఎడమకాల్వ, ఏఎమ్ఆర్పీ, వరద కాల్వ కింద రైతులు ఎక్కువగా వరి సాగు చేస్తుంటారు. ఈసారి సాగర్ నుంచి సాగునీరు విడుదల కాలేదు. బోర్లు, బావులు ఆధారంగా చేసుకుని పలు మండలాల్లో రైతులు వేల ఎకరాల్లో వరి సాగు చేశారు.
Water Problem in Nalgonda : నాట్లు వేసిన తర్వాత నెల పాటు బావులు, బోర్ల ద్వారా సరిపోను నీరందింది. పొలాలు బాగానే ఉన్నాయి. ఆ తర్వాత భూగర్భ నీటిమట్టం గణనీయంగా పడిపోవడం, ఎండలు ముదరడం వల్ల పొలాలు ఎండిపోయాయి. ఎండిన వరి పొలాలను చూసి రైతులు లబోదిబోమంటున్నారు. చేసేదేమి లేక పంట పొలాలను మేకలకు, పశువులకు పశుగ్రాసంగా వదిలేశారు. వర్షాలు లేక చెరువులు, కుంటలు ఎండిపోయి జిల్లాలో కరవు ఛాయలు అలుముకున్నాయి.
నీరు లేక చివరి దశలో ఎండిపోతున్న పంటలు- కాపాడుకునేందుకు రైతుల నానాతంటాలు
Crops Drying Due To Lack Of Water In Nalgonda : గత నెల వరకు వరిచేలు పచ్చని పైరులా బాగానే ఉన్నాయని పంట పొట్ట దశకి వచ్చేటప్పటికి భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయని కర్షకులు వాపోతున్నారు. అప్పు తీసుకువచ్చి పంట వేశామని కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు. మండిపోతున్న ఎండలతో ఎక్కడా పశువులకు మేత దొరకని పరిస్థితి నెలకొంది. సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయానికి నీళ్లు లేక ఎండిపోవడంతో పశువులకు మేతగా ఉపయోగిస్తున్నారు. పొలాలు ఎండిపోయాయని ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
"కనీసం పది రోజులైనా నీళ్లు విడుదల చేస్తే పంట నష్టపోయే వాళ్లం కాదు. పంట చేతికి వచ్చే సమయానికి నీరు అందక ఎండిపోయాయి. ఈసారి సాగర్ నుంచి సాగునీరు విడుదల కాలేదు. అప్పులు తెచ్చి పంటలు వేసాం. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తగిన పరిహారం ఇచ్చి ఆదుకోవాలి." - రైతులు
నల్గొండ జిల్లాలో కరవు ఛాయలు : జిల్లా వ్యాప్తంగా సాగు చేసిన వేరుశనగ, మొక్కజొన్న పంటలకు నీరు లేక ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇంకొద్ది రోజులు నీరు అందితే పంట చేతికొచ్చే అవకాశం ఉన్నా ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. ఈ దశలో పంటలకు నీరు లేకపోవడం వల్ల నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోరుబావుల్లో నీళ్లున్నాయని భావించి నెలరోజుల కిందట సాగుచేసిన మొక్కజొన్న సైతం ప్రస్తుతం ఎండి పోతున్నాయని వాపోయారు. పెట్టిన పెట్టుబడులు కూడా చేతికందని పరిస్థితి ఉందని, ప్రభుత్వం చొరవ తీసుకుని ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.