Water Crisis in Kodur: నీళ్లే మానవునికి జీవనాధారం. ఆహారం లేకపోయినా జీవించవచ్చు కానీ నీళ్లు లేకపోతే కష్టం. అటువంటి తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించేది కొందరు. అంత దూరం ప్రయాణించలేక అందుబాటులో ఉన్న కలుషిత నీరు తాగు అనారోగ్యం బారిన పడుతున్న వారు కొందరు. ఇవి కృష్ణా జిల్లా కోడూరు మండలంలో పలు గ్రామాల ప్రజల తాగునీటి కష్టాలు.
వేసవి ప్రారంభంలోనే తాగునీటి సమస్య - పట్టించుకోని మున్సిపల్ అధికారులు
Basavanipalem Water Problem: కోడూరు మండలంలోని పలు గ్రామాల్లో తీవ్ర త్రాగు నీటి ఎద్దడి నెలకొంది. స్థానిక ప్రజలు గత నెల రోజులకుపైగా గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తున్నారు. అందుబాటులో ఉన్న కుళాయి నుంచి వచ్చే కొద్దిపాటి నీరు పచ్చగా ఉండటం, దుర్వాసన రావటంతో ఆ నీటిని తాగి అనారోగ్యాల బారిన పడుతున్నామని స్థానికులు పేర్కొన్నారు. ఈ నీటితో స్నానం చేసినా శరీరం అంతా దద్దుర్లు వస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. కిలోమీటరు దూరంలో బంగాళాఖాతం ఉండటం సముద్రం ఆటు పోటుకు ఉప్పునీరు చొచ్చుకు వచ్చి భూగర్భ జలాలు ఉప్పు నీటిగా మారుతున్నాయని తెలిపారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రజలకు ఇక్కట్లు: అధికార ప్రభుత్వం ఇంటింటికి ఇస్తామన్న కుళాయి బూటకంలా మారిందని స్థానికులు మండిపడ్డారు. బసవవానిపాలెంలో ఉన్న అయిదు కుళాయిల్లో కేవలం రెండు గంటలు మాత్రమే నీరు ఇస్తున్నారని, ఆ నీరు ఇంటి అవసరాలకు వాడుకోవడానికి కూడా పనికి రావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు దుర్వాసన రావటంతో పశువులకు కూడా త్రాగునీరు దొరకని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. గత ప్రభుత్వం హయాంలో టాంకర్ల ద్వారా నీరు సరఫరా జరిగేదని ఇప్పుడు కనీసం పట్టించుకునే నాథుడే లేడని ప్రజలు వాపోతున్నారు.
"గత్యంతరం లేక మురికిగా వస్తున్న నీళ్లు పట్టుకుని పక్కనపెట్టుకుని మూడు రోజుల తరువాత తాగుతున్నాం. నీళ్లు వాసన రావటంతో పశువులు కూడా తాగటం లేదు. నిత్యావసరాలకు కూడా నీళ్లు ఉండడం లేదు. ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీళ్లు సరఫరా చేస్తే కొంతవరకూ సమస్య తీరుతుంది. 5 పంపుల ద్వారా వచ్చే నీళ్ల ద్వారా చుట్టు పక్కల గ్రామాల నీటి అవసరాలు తీర్చుకుంటున్నాం. దయచేసి ప్రభుత్వం కనీసం ఇంటింటికి 2 బిందెల నీటిని సరఫరా చేయాలి.రెండు,మూడు నెలల నుంచి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవటం లేదు." -స్థానికులు
ప్రభుత్వమే కనికరించాలి: వేసవిలో కాలువలకు నీరు విడుదల చేసినా చివరి గ్రామాలకు నీరు వెళ్లని పరిస్థితి నెలకొంది. గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో కాలువ గట్టుపై వేసిన చేతి పంపుల్లో నీరుని సైకిల్, మోటార్ బైక్‌లపై కొందరు మోసుకుంటూ నీటిని తెచ్చుకుంటున్నారు. నడవలేని వృద్ధులు కుళాయిల్లో వచ్చిన కలుషిత నీటిని త్రాగి అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం టాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.
శ్రీ సత్య సాయి జిల్లాలో ఉగ్రరూపం దాల్చుతున్న తాగునీటి సమస్య- జాతీయ రహదారిపై బైఠాయించిన మహిళలు