Warangal Young Man Makes Wooden Treadmill : ప్రతిదినం వ్యాయామంతో ఆరోగ్యం పదిలం. కానీ, ఈ బిజీ లైఫ్‌లో అందుకు సమయమే దొరకడం లేదు. ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ ఉన్నవాళ్లు ఎలాగైన వ్యాయామం చేయాలనే ఉద్దేశంతో ట్రెడ్‌మిల్ లాంటివి కొనుగోలు చేస్తున్నారు. అలాంటి వారిని దృష్టిని ఆకర్షించేందుకు వినూత్నంగా ఆలోచించాడీ యువకుడు. తక్కువ ఖర్చుతో చెక్క ట్రెడ్‌మిల్‌ని తయారు చేస్తూ కష్టమర్ల మన్ననలు పొందుతున్నాడు.
కులవృత్తినే నమ్ముకుని : ఇతని పేరు హరీశ్‌చారి. తల్లిదండ్రులు అరుణ్ కుమార్, వసంత. వరంగల్‌లోని కాట్రపల్లి స్వస్థలం. ఇంట్లో ఆర్థిక సమస్యల కారణంగా పీజీ చదువును మధ్యలోనే ఆపేశాడు. దాంతో పాటు సోదరి విహాహం కోసం చేసిన అప్పులు అంతకంతకు పెరుగుతుడంటంతో ఇతని కుల వృత్తి అయిన కార్పెంటింగ్ వర్క్‌లోనే నిమగ్నమై అప్పులు తీర్చినట్లు హరీశ్ చెబుతున్నాడు.
తక్కువ ఖర్చుతో 15 రోజుల్లోనే ట్రెడ్‌మిల్ : వండ్రంగి వృత్తిలోనే వినూత్నంగా రాణించాలని హరీశ్ భావించాడు. పట్టణాల్లో నివసించేవారు వ్యాయామం చేయడం కోసం ఎక్కువగా ట్రెడ్‌మిల్‌ని కొనుగోలు చేస్తున్నారని గుర్తించాడు. దీంతో తక్కువ ఖర్చులోనే ట్రెడ్‌మిల్ తయారు చేయాలనుకున్నాడు. చెక్కతో పాటు బెల్ట్, బేరింగ్, రింగ్‌లు వంటి పరికరాలను ఉపయోగించి 15 రోజుల్లోనే ట్రెడ్‌మిల్‌ను తయారు చేశాడు.
100 కేజీల బరువును తట్టుకునేలా ఈ ట్రెడ్‌మిల్‌ని తయారు చేశానని హరీశ్ అంటున్నాడు. దీనిని వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో చాలా మంది కొనుగోలు చేయడానికి వస్తున్నారని వివరించాడు. కరెంట్‌తో అవసరం లేకుంటా పనిచేయడం వల్ల వరంగల్‌తో పాటు హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నట్లు హరీశ్ చెబుతున్నాడు.
సంగీతంలోనూ రాణిస్తూ : చెక్క ట్రెడ్‌మిల్‌తో పాటు మంచాలు, సోఫాలు, పోడియం, ఇంట్లో పెట్టుకునేలా ఫ్లైయింగ్ బర్డ్స్ వంటి బొమ్మలు కూడా తయారు చేస్తున్నాృడు హరీశ్. అంతేకాదు ఎక్కడికైనా తీసుకువెళ్లే విధంగా ఫొల్డింగ్ కూర్చీని తయారు చేసి స్థానికుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. వృత్తి నైపుణ్యంతో పాటు సంగీతంలో కూడా హరీశ్‌కు ప్రావీణ్యం ఉంది. ఓ సంగీత ఉపాధ్యాయుడి దగ్గర బేసిక్స్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత యూట్యూబ్ వీడియోలు చూసి కొన్ని స్వరాలు నేర్చుకున్నాడు. పని ఒత్తిడి, మానసిక ప్రశాంతత కోసం సినిమా, భక్తిపాటలు వాయిస్తుంటానని అంటున్నాడు హరీశ్.
కుమారుడు వృత్తిలో రాణించడంపై ఆనందం వ్యక్తం : కుమారుడు చిన్ననాటి నుంచి చాలా కష్టాలు పడ్డాడని హరీశ్ తల్లి అంటోంది. కుటుంబ వృత్తిలోనే వినూత్నంగా రాణిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెబుతోంది. వృత్తి నైపుణ్యంతో పాటు వినసొంపైన వేణుగానంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు హరీశ్. ట్రెడ్ మిల్ తరహాలనో మరిన్ని పరికరాలను చెక్కతో తయారు చేయాలని భావిస్తున్నాడు. ఉద్యోగం కోసం చూడకుండా వృత్తినే ఉపాధిగా మలచుకుని వినూత్న రీతిలో రాణిస్తున్నాడు హరీశ్.