Warangal Man Selected For ISRO Tutor : ఇస్రోలో(భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ)లో మహామహులైన శాస్త్రవేత్తలు ఉంటారు. మన దేశ అంతరిక్ష పతాకను అంతర్జాతీయస్థాయిలో రెపరెపలాడించిన దిగ్గజాలు ఆ సంస్థలో పని చేస్తారు. అంతటిమహామహులతో కలిసి పని చేయడమంటే మాటలా? కానీ ఆ ఘనత అందుకున్నాడు తెలంగాణ కుర్రాడు శశాంక్ భూపతి. ప్రధాని మోదీ ప్రశంసలు సైతం పొందిన ఈ యువకెరటం గురించి తెలుసుకుందామా?
స్పేష్ ట్యూటర్‌గా ఎంపికైన శశాంక్ : ఇస్రోలో(భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ) ట్యూటర్ అవకాశం కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా దరఖాస్తులొచ్చాయి. అనేక వడపోతల అనంతరం తెలుగు రాష్ట్రాల(ఆంధ్ర, తెలంగాణ) నుంచే కాక దక్షిణాది నుంచి ఎంపికైంది శశాంక్ మాత్రమే. అతడి ఆర్కిటెక్ట్ కంపెనీ ‘ఏన్షియెంట్ టెక్నాలజీ డిజైన్ రిసెర్చ్ ల్యాబ్’ ప్రతిభకు మెచ్చి ఈ అవకాశం కల్పించారు. ఈ కంపెనీ ఇస్రో సహకారంతో దేశంలోని వివిధ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్, అన్ని వర్గాల వారికి అంతరిక్షం పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తుంది.
ఇస్రో చేసేటువంటి రీసెర్చ్‌కు సహాయ సహకారాలు అందించే బాధ్యతను స్పేస్ ట్యూటర్‌లు తీసుకుంటారు. వీరు స్పేస్‌లోకి వ్యోమగాములను తీసుకెళ్లేటువంటి రాకెట్లను డిజైన్ చేస్తారు. తక్కువ ఖర్చుతో, ఎక్కువ మౌలిక వసతులు ఉండేవిధంగా చూస్తారు. స్పేస్‌లోకి వెళ్లిన తర్వాత 4 ఏళ్ల పాటు అన్ని వసతులూ ఉండేలా దీనిని రూపొందిస్తారు.
అలా మొదలైంది : హనుమకొండ ప్రాంతానికి చెందిన శశాంక్‌కి చిన్నప్పట్నుంచి అంతరిక్షం, ఆకాశం అంటే అమితమైన ఆసక్తి. తండ్రితో కలిసి బైక్‌పై రాత్రి వెళ్లేటప్పుడు ‘చందమామ మన వెనకాలే ఎందుకు వస్తోంది? ‘వర్షం పైనుంచే ఎందుకు పడుతోంది?’లాంటి ప్రశ్నలతో నాన్నను విసిగించేవాడు. ఏదైనా కొత్త విషయం తెలిస్తే దాని అంతు చూసేదాకా విడిచిపెట్టేవాడు కాదు. ఇక ఓరుగల్లు(వరంగల్) అంటేనే పురాతనమైన కట్టడాలకు ప్రఖ్యాతి. ఓరుగళ్లులోని వేయి స్తంభాల గుడి, భద్రకాళి ఆలయం, కాకతీయుల కోటలను శశాంక్ తరచూ సందర్శిస్తుండేవాడు.
ఉన్నత విద్య అయ్యాక, స్పేస్ ఆర్కిటెక్చర్ స్పెషలైజేషన్‌తో ఫైన్‌ఆర్ట్స్ కోర్సులో విద్యనభ్యసించారు. అందులో భాగంగా మూడేళ్లుపాటు పురాతన కట్టడాలు, కోటలు, భవనాలపై అధ్యయనం చేశారు. ఆపై గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లోని ‘ఆకాశ్ స్పేస్ స్టూడియో’లో 2 ఏళ్లు పని చేశాడు. ఇది ఆసియాలోనే స్పేస్ ఆర్కిటెక్చర్‌పై పనిచేసేటువంటి ఏకైక కంపెనీ. ఆ అనుభవంతోనే 2 ఏళ్ల కిందట సొంత కంపెనీని ప్రారంభించాడు. దాని తరఫున కొన్ని డిజైన్లను రూపొందించి ఇస్రోకు పంపేవాడు శశాంక్.
బెంగళూరు, చెన్నైలలో ఇస్రో(భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) ఏర్పాటు చేసినటువంటి పలు వర్క్‌షాప్‌లు, సెమినార్లలోనూ పాల్గొన్నాడు. ప్రఖ్యాత వ్యోమగామి సునీతా విలియమ్స్ మౌలిక వసతులు లేక, ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యకు పరిష్కారంగా రాకెట్లలో స్వల్ప విస్తీర్ణంలో, తక్కువ ఖర్చులో, అన్నిరకాల మౌలిక వసతులు ఉండేవిధంగా ఒక నమూనా రాకెట్‌ను డిజైన్ చేశాడు. ఈ ప్రతిపాదన ఇస్రోకు నచ్చి శశాంక్‌ను ట్యూటర్‌గా ఎంపిక చేసింది.
మోదీ ప్రశంసలు : "ఈ ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్‌కు వచ్చినప్పుడు నేనే స్వయంగా దగ్గరుండి భద్రకాళి దేవాలయం విశిష్ఠతను వివరించాను. నా అంతరిక్ష అధ్యయనాలతో పాటు స్పేస్‌పై ఉన్న ఆసక్తి, విజయాల గురించి ఆయనకు చెప్పాను. దాంతో ఆయన నన్ను మెచ్చుకొని, ఇంకా సరికొత్త ప్రయోగాలు చేయమని సూచించారు. ప్రస్తుతం భారత అంతరిక్ష పరిశోధన సంస్థతో కలిసి దేశవ్యాప్తంగా పలు విద్యాసంస్థల్లో అంతరిక్షం(స్పేస్) పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పరిశోధనల్లోను భాగస్వాములమవుతాం. రానున్న 10 ఏళ్లలో సొంతంగా రాకెట్ తయారు చేసి అంతరిక్షంలోకి పంపించడమే నా లక్ష్యం' అని ఇస్రో స్పేష్ ట్యూటర్ శశాంక్ తెలిపారు.
కోచింగ్ లేకుండానే ఏడు ఉద్యోగాలు - ఈ మాస్టారు 'లెక్కే' వేరు
పరిశోధనల్లో యువ వైద్యురాలి ప్రతిభ - 10 పేటెంట్ హక్కులు పొందిన డాక్టర్ - Young Doctor Uma Devi