VRO Land Grabs Along with YSRCP Leaders: జగనన్న రీసర్వే ఓ వీఆర్వోకు భూములు కొల్లగొట్టేందుకు మార్గం సుగమం చేసింది. దశాబ్దాల నాటి భూ రికార్డులను శోధించి, ఆధారాలు లేని నిరుపేద హక్కుదారుల భూములే లక్ష్యంగా కబ్జాలకు దిగాడు. ఇలా వందల ఎకరాలు కాజేశాడు శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలంలోని వీఆర్వో. వైసీపీ నాయకుడి అండదండలతో ఆరేళ్లుగా చెన్నేకొత్తపల్లి మండలంలోనే విధులు నిర్వహిస్తూ భూ దందాలు, సెటిల్మెంట్లు, అక్రమాలతో అవినీతికి పాల్పడుతూ 50 కోట్లరూపాయలు ఆర్జించాడు.
శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి వీఆర్వో పేరు చెబితే దళిత రైతులు బెంబేలెత్తిపోతున్నారు. మగదిక్కు లేని నిరుపేద రైతు కుటుంబాలైతే తమ భూమిని ఎప్పుడు కబ్జా చేస్తాడోనని భయాందోళనకు గురవుతున్నారు. ఆరేళ్ల క్రితం చెన్నేకొత్తపల్లికి వీఆర్వోగా వెళ్లిన ఆయన వైసీపీ సర్కారు రావటంతోనే అక్రమాలకు తెరలేపాడు. కియా పరిశ్రమ వచ్చాక సీకేపల్లిలో భూముల విలువలు భారీగా పెరిగాయి.
సంతకాలు ఫోర్జరీ చేసి భూములు దోపిడీ - రెచ్చిపోతున్న వైసీపీ మూకలు
రీ సర్వేలో భాగంగా ఆయా భూముల రైతుల వద్ద యాజమాన్య హక్కు నిర్ధారించే ఆధారాలు ఉంటే సెటిల్మెంట్, లేకుంటే విక్రయ అగ్రిమెంట్ల పేరుతో ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేసుకుని భూమిలోకి దిగుతున్నాడు. బాధితులు నెత్తీనోరూ బాదుకున్నా పట్టించుకోడు. పోలీసుల సహకారంతో కోర్టు వివాదాల్లో ఉన్న భూములను కబ్జా చేస్తున్నాడని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీఆర్వో అక్రమాలు అంతటితో ఆగలేదు. తహశీల్దార్ కార్యాలయంలో ఓ ప్రైవేట్ సర్వేయర్ సహకారంతో భూముల వివరాలు తీసుకొని వాటిని తన అనుయాయుల పేర్లతో రిజిస్ట్రేషన్ చేసి ఆన్‌లైన్ చేయిస్తున్నాడు. 44వ నెంబర్ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న 21 సెంట్ల దళితుడి భూమి రికార్డులు మార్చి తన సోదరుడి పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. సర్వేనెంబర్లు 462, 463లో పదెకరాల ప్రభుత్వ భూమిని బినామీ పేర్లమీద ఆన్‌లైన్ చేసుకున్నాడు.
అనాథాశ్రమాల నుంచి ప్రార్థనాలయాల వరకూ - వారి కన్ను పడితే అంతే!
సీకేపల్లి ప్రధాన వీధిలోని 323-1 సర్వేనెంబర్‌లో ఏడు సెంట్ల వాణిజ్య భూమిని ఈ వీఆర్వో కొనుగోలు చేసి ఆ స్థలం వెనుక ఉన్న రహదారిని ఆక్రమించటంతో స్థానికులు తిరగబడ్డారు. దీంతో ఓ పోలీసు అధికారి సహకారంతో వారిని బెదిరించారని బాధితులు చెబుతున్నారు. చెన్నేకొత్తపల్లి మండలంలో వైసీపీ నాయకుల అండదండలతో వీఆర్వో పెద్దఎత్తున భూములు, ఆస్తులు కొల్లగొడుతూ ఐదేళ్లలో కోట్ల రూపాయల అక్రమార్జన చేశారని ఆరోపణలు ఉన్నాయి.
సీఎం జగన్ హెలీప్యాడ్ కోసం లీజుకు తీసుకున్న స్థలంపై కన్నేసిన వీఆర్వో సాగుభూమిని కబ్జా చేశారని దళిత రైతు వాపోయారు. సీఎం పర్యటనను కూడా అనుకూలంగా మలుచుకున్న ఆ వీఆర్వో అక్రమ సంపాదనతో పుట్టపర్తి, ఇతర రాష్ట్రాల్లో ఖరీదైన భూములు, ఆస్తులు కొనుగోలు చేసినట్లు సమాచారం.