Voters in Telangana 2024 : తెలంగాణలో తాజా సవరణ అనంతరం ఓటర్ల సంఖ్య 3,30,13,318కి చేరింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 9,14,354 మంది ఓట్లను తొలగించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. అలాగే ఇప్పటివరకు ఓట్ల తొలగింపు, సవరణల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను సోమవారానికి పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం 7,31,573 దరఖాస్తులకు సంబంధించిన సవరణను పూర్తి చేశామని వికాస్‌రాజ్ వెల్లడించారు.
3,30,13,318 మంది ఓటర్లు : తెలంగాణలో 3,30,13,318 మంది ఓటర్లు నమోదయ్యారని వికాస్‌రాజ్ తెలిపారు. వారిలో 1,65,95,896 మంది మహిళలు కాగా, 1,64,14,693 మంది పురుషులు, 2,729 మంది ఇతరులని చెప్పారు. 18-19 సంవత్సరాల తొలితరం ఓటర్లు 8,72,116 మంది నమోదైనట్లు పేర్కొన్నారు. 85 సంవత్సరాలు దాటిన వారు 1,93,489 మంది, దివ్యాంగులు 5,26,286 మంది, సర్వీసు ఓటర్లు 15,472 మంది, ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 3,409 మంది ఉన్నారని వివరించారు. నూతనంగా ఓటరు నమోదుతోపాటు ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ఓటు మార్చుకునేందుకు వచ్చే నెల 15 వరకు గడువు ఉందని అన్నారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికలు ముగిసే వరకు ఓట్ల తొలగింపు, వివరాల సవరణ ప్రక్రియ ఉండబోదని వికాస్‌రాజ్ స్పష్టం చేశారు.
అమల్లోకి ఎన్నికల కోడ్ - నిఘా పెంచిన ఈసీ - ఎక్కడికక్కడ ముమ్మర తనిఖీలు
Election Code Inspection in Telangana 2024 : మరోవైపు ఎన్నికల నియామవళి అమలు, తనిఖీల్లో (Police Checkings in Telangana) భాగంగా రూ.38.12 కోట్ల విలువైన నగదు, నగలు, మద్యం, మత్తు పదార్థాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు సీఈఓ వికాస్‌రాజ్ వెల్లడించారు. ఇందులో రూ.9,01,67,748 నగదు, రూ.3,34,10,277 విలువైన మద్యాన్ని పట్టుకున్నామని చెప్పారు. రూ. 8.14 కోట్ల విలువైన 28 కిలోల బంగారం, వెండి ఆభరణాలు జప్తు చేసినట్లు వికాస్‌రాజ్ తెలిపారు.
రూ.3,95,41,697 విలువైన చీరలు, ల్యాప్‌టాప్‌లు, కుక్కర్లు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వికాస్‌రాజ్ వివరించారు. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి రూ.13.66 కోట్ల విలువైన 410 కిలోల డ్రగ్స్ పట్టుకున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు నిరంతరం నిఘా పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నాయని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు.
దేశంలో 97 కోట్ల మంది ఓటర్లు- కొత్తగా లిస్ట్‌లోకి 2 కోట్ల మంది యువత
ఏడు దశల్లో 2024 లోక్‌సభ ఎన్నికలు- జూన్ 4న కౌంటింగ్- పూర్తి షెడ్యూల్ ఇదే