Vontimitta Sri Kodanda Rama Brahmotsavam : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం ఉదయం వేణుగానాలంకారంలో స్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7.30 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ నటేష్ బాబు, సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, తదితరులు పాల్గొన్నారు.
ఒంటిమిట్టలో కోదండరాముడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం - VONTIMITTA BRAHMOTSAVAM
తొలిరోజు సీతారాములు ప్రత్యేక అలంకరణ : శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో తొలిరోజు బుధవారం రాత్రి సీతారాములు ప్రత్యేక అలంకరణలో శేష వాహనంపై భక్తులకు దర్శన మిచ్చారు. సీతారామలక్ష్మణ ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, పుష్పమాలికలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. గ్రామోత్సవం ఆద్యంతం నేత్రపర్వంగా సాగింది. ఒంటిమిట్ట పుర వీధుల్లో పండగ వాతావరణం నెలకొంది. దారి పొడవునా తాళ భజనలు, కోలాట నృత్య ప్రదర్శనలు, సన్నాయి మేళాలు, కేరళ కళాకారుల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు ధ్వజారోహణం క్రతువు వైభవంగా జరిగింది. టీటీడీ పాంచరాత్ర ఆగమ సలహాదారు కల్యాణపురం రాజేష్ భట్టార్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం యాగశాలలో హోమాలను శాస్త్రోకంగా నిర్వహించారు. అనంతరం గరుత్మంతుని పటాన్ని ప్రదక్షిణ చేశారు. ఉదయం 10.30-11 గంటల వరకు మిథున లగ్నంలో ఆగమశాస్త్రబద్ధంగా గరుడ పటాన్ని ప్రతిష్ఠించారు. ధ్వజరోహణ ఘట్టం కనులపండువగా సాగింది. ధ్వజస్తంభానికి నవకలశ పంచామృతాభిషేకం చేశారు. వేదపండితులు వేదపారాయణం చేశారు.
భక్తులు పెద్దసంఖ్యలో హాజరై తిలకించారు. ఆలయానికి రద్దీ పెరగడంతో ఉదయం 11 గంటల నుంచి మహా లఘు దర్శనం అమలు చేశారు. రామనామస్మరణతో పురుషోత్తముడి దివ్య క్షేత్రం మార్మోగింది. టీటీడీ డిప్యూటీ ఈవోలు నటేష్‌బాబు, శివప్రసాద్ పర్యవేక్షణలో రామాలయం నుంచి ముత్యాలను కల్యాణ ప్రాంగణంలో ఉన్న యాత్రికుల విడిది భవనానికి తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం డిప్యూటీ ఈవో ప్రశాంతి ఆధ్వర్యంలో ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను సిద్ధం చేశారు. సీఈ నాగేశ్వరావు, ఎస్‌ఈ జగదీశ్వర్‌రెడ్డి, డీఎఫ్‌వో శ్రీనివాసులు, ఈఈ సుమతి పాల్గొన్నారు.
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు - అధికారులతో టీటీడీ జేఈవో సమీక్ష