Volunteers working as YCP Agents in AP : ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు నగరం మిట్టూరు పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత నెలకొంది. బూత్ నెంబర్ 73లో రాజీనామా చేసిన వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్లుగా ఉండటంపై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత సీకే బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాసేపు పోలింగ్ ప్రక్రియకు అంతరాయం ఏర్పడింది.
వాలంటీర్లు రాజీనామా చేసి, దానిని ఆమోదించిన పత్రాన్ని చూపించాలని సీకే బాబు పట్టుబట్టారు. ఇదే సందర్భంలో వైసీపీ అభ్యర్ధి విజయానంద రెడ్డి అక్కడికి చేరుకుని సీకే బాబుతో వాగ్వాదానికి దిగారు. పోలింగ్ జనరల్ ఏజెంటుగా ఉన్న తాను పోలింగ్ సరళిని పరిశీలించే హక్కు ఉందని సీకే బాబు తెలిపారు. వాలంటీర్లు రాజీనామా చేయకుండా పోలింగ్ బూత్‌లో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
వాలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని సీకే బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి గురజాల జగన్మోహన్ అక్కడికి చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చిత్తూరు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, సంయుక్త కలెక్టర్ శ్రీనివాసులు అక్కడికి చేరుకునీ ఇరు వర్గాలకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేశారు.
టీడీపీ నేతల డిమాండ్: రాజీనామా చేసిన వాలంటీర్, ఏజెంట్ గా ఎన్నికల కేంద్రంలో ప్రలోభాలకు తెరలేపుతున్నారని ఈ సందర్భంగా టీడీపీ నేతలు ఆరోపించారు. ఇదే అంశాన్ని పోలీసులు, జిల్లా అధికారులకు తెలిపామని పేర్కొన్నారు. ఉదయం 7 గంటలకే ఈ విషయాన్ని ఎన్నికల అధికారులకు తెలిపామని వెల్లడించారు. అయినప్పటికీ ఇంకా పోలింగ్ ఏజెంట్లుగా వాలంటీర్లు కొనసాగుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు టీడీపీ నేతలు తెలిపారు. సంబంధిత అధికారులపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
తిరుపతిలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది ఓటర్లు ఓటు వేసేందుకు క్యూలైన్లో బారులు తీరారు. కొన్ని పోలింగ్ కేంద్రాలలో పోలీసుల పర్యవేక్షణ కరువైంది. వైసీపీ నాయకులు పోలింగ్ కేంద్రం వద్ద హల్చల్ చేస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. అయినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోవాడంలేదని కూటమి నేతలు ఆరోపింస్తున్నారు. బహిరంగంగా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని పేర్కొన్నారు. డబ్బులు పంచుతూ ప్రలోభాలకు గురి చేస్తున్నారని కూటమి నేతలు ఆరోపించారు.