Viral Fever Increasing in Telugu States : ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఏ ఒక్కరిని పలకరించినా సంబంధికులతో ఫోన్‌లో సంభాషించినా చర్చంతా సీజన్ వ్యాధులపైనే. ఎలా ఉన్నావు? అని అడగడం బదులు ఇంట్లో వాళ్లు వ్యాధుల నుంచి బయట పడ్డారా? లేదా? అని అడగాల్సిన పరిస్థితి తలెత్తింది. అంటే విషజ్వరాల విజృంభణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
వాతావరణ మార్పులు, అపరిశుభ్ర పరిస్థితులు వెరసి పల్లెలు, పట్టణాలు, చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. సాధారణంతో పోల్చితే 2రెట్లు అధికంగా జ్వరపీడితులు ఆసుపత్రుల బాట పడుతున్నారు. మొదట చిన్నగా మొదలవుతున్న జలుబు గొంతులో గరగర, గొంతునొప్పి, తలనొప్పితో వైరల్ జ్వరంగా మారుతుంది.
ఆసుపత్రుల్లో సరిపోని పడకలు : వారంరోజుల తర్వాత జ్వరం తగ్గుముఖం పట్టినా కాళ్లు, కీళ్లనొప్పులు తగ్గడం లేదు. ఆసుపత్రుల్లో చేరే వారిలో 50% మంది టైఫాయిడ్, మలేరియా, డెంగీ, వైరల్ జ్వరాలు, బ్యాక్టీరియల్ నిమోనియా రోగులే ఉంటున్నారు. కొన్ని చోట్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు సరిపోక ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురు రోగులను ఉంచాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.
ఓవైపు వరదల బీభత్సం! - మరోవైపు విషజ్వరాలు - కట్టడికి మార్గాలేంటి? - Viral Fevers in Telangana
తెలంగాణాలోనూ విష జ్వరాల విజృంభణ అధిక స్థాయిలో ఉంది. ఈ ఏడాది 4వేల 6 వందల మంది డెంగీ బారిన పడినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ వెల్లడించారు. ఒక్క ఆగస్టు నెలలోనే సుమారు 19వందల కేసులు నమోదయ్యాయి. జ్వరం లక్షణాలతో నిత్యం వందల మంది ఆసుపత్రులకు వరుస కడుతున్నారు. ముఖ్యంగా డెంగీ కేసులు భారీగా పెరుగుతునట్టు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి
డెంగీ, టైఫాయిడ్ కేసులు ఎక్కువ : ఉమ్మడి మెదక్ జిల్లాలో 2నెలల్లో 186 డెంగీ కేసులు నమోదయ్యాయి. వైద్యారోగ్యశాఖ పరిధిలోని పీహెచ్‌సీల్లో జులై నెలలో 70 డెంగీ కేసులు నమోదు ఆగస్టులో 116 కేసులు వచ్చాయి. ఆందోలులోని తాలెల్మ పీహెచ్‌సీలో 30 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో వైరల్ ఫీవర్ కేసులు 2వేల 576 నమోదు కాగా 32మందికి టైఫాయిడ్ సోకినట్లు వైద్యాధికారులు తెలిపారు.
ఖమ్మం జిల్లా వైరాలోని బీసీ కాలనీలో 100 మందికి పైగా జ్వరాలతో బాధపడుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. మధిరలో 60 మందికి పైగా జ్వరాలతో బాధపడుతున్నారు. తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లిలో అధికారికంగా 10 మందికి డెంగీ జ్వరం సోకింది. మరో 20 మంది డెంగీ లక్షణాలతో బాధపడుతున్నారు. సుమారు 100 మందికి కాలానుగుణ వ్యాధులు ప్రబలాయి.
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఒక్క వారంలోనే 3598 మంది జ్వరాల బారిన పడినట్లు ఓపీ నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో చేపట్టిన జ్వర సర్వే ప్రకారం ఇప్పటివరకు 8,246 మంది జ్వరం బారిన పడ్డారు. అందులో 7291మంది కోలుకోగా 955మంది కోలుకోవాల్సి ఉందని జ్వర సర్వేలో వెల్లడైంది. కాగా నిజామాబాద్ జిల్లాలో 376 డెంగీ కేసులు నమోదయ్యాయి.
మహబూబ్‌నగర్ జిల్లాలో 20డెంగీ కేసులు నమోదు కాగా, మే నెలలో 1946, జూన్‌లో 1931, జులైలో 2,066, ఆగస్టులో 1074 జ్వర కేసులు నమోదు అయ్యాయి. ఇక కరీంనగర్ జిల్లాలో అయితే ఏ ఇంటి తలుపు తట్టినా జ్వర పీడితులే ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.
జిల్లాలో నిర్వహించిన జ్వర సర్వే ప్రకారం 3700మంది జ్వరం బారిన పడ్డారు. డెంగీ బారిన 70మంది పడగా 10మందికి టైఫాయిడ్ వచ్చింది. వాంతులు, విరేచనాల బారిన పడిన వారు 31మంది ఉన్నట్లు జ్వర సర్వేలో వెల్లడైంది. సిద్దిపేట జిల్లాలో 1641మంది జ్వరం బారిన పడగా 55మందికి డెంగీ బారిన పడ్డారు. ఇద్దరికి టైఫాయిడ్ అటాక్ అయింది.
రానున్న కాలంలో మరిన్ని పెరగనున్న కేసులు : కాలంతో పాటు వస్తోన్న విష జ్వరాలతో వేలాది మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. దీంతో పలు ఆసుపత్రుల్లో ఒక్కో బెడ్డును ఇద్దరు లేదా ముగ్గురికి కేటాయిస్తున్న పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. కాగా గ్రామాల్లోని ఆర్‌ఎంపీ వైద్యులతో చికిత్స చేయించుకున్నవారూ వేలల్లో ఉంటారు.
రానున్న రోజుల్లో విషజ్వరాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధుల తీవ్రత మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ప్రజలు విష జ్వరాలు, వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు చెబుతున్న మాట. కావున అందరం అప్రమత్తంగా ఉందాం. ఆరోగ్యాన్ని సంరక్షించుకుందాం.
వణికిస్తోన్న విషజ్వరాలు - కట్టడి చర్యలకు మార్గాలేంటి? - Viral fever Increasing In Telangana