Vijayawada One Town Market Story : ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా? ఏదైనా పండగ షాపింగ్ చేయాలా? చిన్న స్థాయిలో బిజినెస్ స్టార్ట్ చేయాలా? ఇంట్లోకి ఏమైనా సరుకులు కావాలా? ఏది కావాలన్నా అక్కడ దొరికేస్తుంది. చిన్న వస్తువు మొదలుకొని పెద్ద వస్తువు దాకా ఏదైనా సరే హోల్‌సేల్, రిటైల్‌లో అక్కడ లభిస్తుంది. ఇక్కడ దొరకని వస్తువంటూ లేదంటే అతిశయోక్తి కాదేమో. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తుంటారు. ఇదంతా చదివి, హైదరాబాద్ బేగంబజార్ గురించి చెబుతున్నామనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. ఇంతకీ ఆ ప్లేస్ ఏంటంటే?
ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపార కేంద్రానికి బెజవాడ కేంద్ర బిందువుగా మారింది. నగరానికి తలమానికంగా ఉన్న వన్ టౌన్ వ్యాపారరంగంలో ప్రత్యేక గుర్తింపు పొందింది. స్థానిక కాళేశ్వర మార్కెట్ సెంటర్, శివాలయం వీధి తదితర ప్రాంతాల్లో జోరుగా అమ్మకాలు సాగుతుంటాయి. హోల్‌సేల్, రిటైల్‌గా ఏది కావాలన్నా దొరుకుతుంది. అన్ని రంగాలకు సంబంధించిన వస్తువులూ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఒకరకంగా ఈ ప్రాంతాన్ని బెజవాడ బేగంబజార్ అని చెప్పొచ్చు.
ఏది కావాలన్నా దొరుకుతుంది : బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు, బంగారం, రాగి, ఇత్తడి, ఆటో మోబైల్స్‌కు సంబంధించినవి, ఇంటి సరుకులు, ప్లాస్టిక్, బ్యాంగిల్స్, తినుబండారాలు, పండ్లు, కూరగాయలు, సైకిళ్లు ఇలా కావాల్సినవన్నీ ఒకేచోట లభిస్తుండటంతో ఇక్కడ కొనుగోలు చేసేందుకు ప్రజలూ ఆసక్తి కనబరుస్తున్నారు. పండుగలు, పెళ్లిళ్ల సమయాల్లో కుటుంబ సమేతంగా వచ్చి తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. నచ్చిన వస్తువులు తక్కువ ధరకే దొరుకుతుండటంతో ఈ ప్రాంతం అంతా నిత్యం జనంతో రద్దీగా ఉంటుంది. ఇక సెలవు రోజుల్లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అమ్మవారితో పాటు మార్కెట్ దర్శనమూ! : నగర ప్రజలతో పాటు పలు జిల్లాల నుంచి సైతం ప్రజలు ఇక్కడకు వచ్చి కొనుగోళ్లు చేస్తుంటారు. రిటైల్ వ్యాపారులు తమ దుకాణాల్లోకి కావాల్సిన సరకులను ఇక్కడే పెద్దమెుత్తంలో కొనుగోలు చేస్తుంటారు. చిన్న చిన్న బిజినెస్‌లు పెట్టుకునే వారు, ఎలక్ట్రీషియన్లు, బైక్, ఫ్రిజ్ మెకానిక్‌ల వంటి వారు ఇక్కడకు వచ్చి తమకు కావాల్సినవి కొనుక్కుంటుంటారు. బెడవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన వారు సైతం అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఇక్కడకు వచ్చి షాపింగ్ చేస్తుంటారు. ఏదైనా వస్తువు కోసం ఇక్కడికి వస్తే కచ్చితంగా దొరుకుతుందనే నమ్మకంతోనే ప్రజలు తమ వద్దకు వస్తారని ఇక్కడి వ్యాపారులు సంతోషంగా చెబుతున్నారు.