Vijayawada CP Rajasekhar Babu on YSRCP Leader Goutham Reddy : తప్పుడు పత్రాలతో భూములు అక్రమించి నిర్మాణాలు చేపట్టడమేగాక న్యాయపోరాటం చేస్తున్న భూ యజమాని ఉమామహేశ్వరశాస్త్రిని అంతమొందించేందుకు వైఎస్సార్సీపీ నేత, ఫైబర్‌నెట్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ గౌతమ్‌రెడ్డి (Goutham Reddy) కుట్రపన్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆయన కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
ఈ విషయంపై విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు స్పందిస్తూ రూ.కోట్ల విలువైన స్థలం కొల్లగొట్టేందుకు గౌతమ్‌రెడ్డి కిరాయి హత్యకు ప్రణాళిక వేసినట్లు విచారణలో తేలిందని అన్నారు. గౌతమ్‌రెడ్డిపై హత్య సహా 43 కేసులు నమోదైనట్లు వివరించారు. అతడిపై గతంలో రౌడీషీట్ నమోదైందని అయితే, అది ఎందుకు మూసివేశారో పరిశీలిస్తామని అన్నారు. గౌతమ్‌రెడ్డిపై నమోదైన కేసులన్నింటిపైనా విచారణ చేస్తామని తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
స్థలం కబ్జా చేసి - యజమానిని హత్య చేసేందుకు వైఎస్సార్సీపీ నేత సుపారీ
రెండు టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు : స్థలం విషయంలో నకిలీ దస్త్రాలతో గౌతమ్‌రెడ్డి మోసగించినట్లు ఫిర్యాదులు వచ్చాయని రాజశేఖర్ బాబు తెలిపారు. ఉమామహేశ్వరశాస్త్రి ఇచ్చిన ఫిర్యాదుపైనా చర్యలు తీసుకుంటున్నామని, ఈ కేసు సంబంధించి ఐదుగురు పరారీలో ఉన్నారని అన్నారు. గాలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, నలుగురు దొరికారని తెలిపారు. అనిల్‌ను పట్టుకోవాల్సి ఉందని, అనిల్‌కు కూడా పృథ్వీరాజ్ నుంచి కాల్స్ ఉన్నాయని తెలిపారు. సాంకేతిక ఆధారాలన్నీ సేకరించి విచారణ చేస్తున్నామని వెల్లడించారు. స్థల యజమానిని హతమార్చడానికి సుపారీ తీసుకున్న విషయంపై దర్యాప్తు చేస్తున్నామని, రెండు టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశామని వివరించారు. హత్య కేసుపై దర్యాప్తు చేస్తుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయని, ఇప్పటికే సేకరించిన ఆధారాలను కోర్టు ముందు ఉంచుతామని పేర్కొన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదని, రౌడీలు ఇష్టారాజ్యంగా చేస్తామంటే వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్‌లపై కఠినంగా ముందుకెళ్తున్నామని అన్నారు.
50కి పైగా కేసులు నమోదు : సోషల్ మీడియాలో అసభ్య పోస్టులను ఉపేక్షించేది లేదని రాజశేఖర్ బాబు తెలిపారు. సామాజిక మాధ్యమానికి సంబంధించి దాదాపు 50కి పైగా కేసులు నమోదయ్యాయని, ఎదుటివారిని కించపరచడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంను వాడుకోవడం దుర్మార్గమని పేర్కొన్నారు.
బెజవాడలో భూయజమాని హత్యకు 'సుపారీ గ్యాంగ్' - తెర వెనక వైఎస్సార్సీపీ నేత