Vijayawada CP on Ganja Cases : ఎన్టీఆర్ కమిషనరేట్‌ను గంజాయి రహిత నగరంగా చేయాలన్న ప్రధాన లక్ష్యంతో యాంటీ నార్కోటిక్ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు సీపీ రాజశేఖర్‌బాబు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 28 కేసులు నమోదు చేసి 77 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. వారి నుంచి 185 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. తాజాగా కమిషనరేట్ పరిధిలోని గవర్నర్‌పేట, పటమట, కొత్తపేట, భవానీపురం పోలీస్‌స్టేషన్ల పరిధిలో 17 మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ రాజశేఖర్‌బాబు తెలిపారు.
Vijayawada Police Seized 47 kgs Ganja : ఇందుకు సంబంధించిన వివరాలను సీపీ వెల్లడించారు. నిందితుల నుంచి 46 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని రాజశేఖర్‌బాబు చెప్పారు. ఈ 17 మందిలో ఇద్దరు బాలలు కాగా మిగిలిన 15 మందిపై పాత కేసులున్నాయని పేర్కొన్నారు. నిందితులపై గంజాయి అమ్మకాలు, గొడవలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న కేసులు ఉండగా, ఒకరిపై మాత్రం వరకట్న వేధింపుల కేసు ఉందని వెల్లడించారు. వీరిలో అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్ మల్లపోలు శివనాగమహేశ్పై గతంలో పీడీ యాక్ట్ పెట్టి నమోదు చేసి ఆ తర్వాత తీసివేశారని చెప్పారు. తాజాగా నేరప్రవృత్తి బయటపడటంతో అతడిపై మళ్లీ పీడీ యాక్ట్ పెట్టేందుకు చర్యలు చేపట్టనున్నట్లు రాజశేఖర్‌బాబు వెల్లడించారు.
'నిందితుల చరిత్రను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గంజాయికి అలవాటుపడిన వీరు మొదట్లో కొనుగోలు చేసి తాగేవారు. అయితే ఆ తర్వాత గంజాయి కొనేందుకు చేతిలో డబ్బులు లేకపోవటంతో ఇబ్బందులు పడ్డారు. దీన్ని అధిగమించేందుకు కొనుగోలు చేసి తెచ్చుకున్న గంజాయిని కొంత వాడుకుని మిగిలింది ఇతరులకు విక్రయించేవారు. ఇలా కొనుగోలుదారులే విక్రయదారులుగా మారారని' రాజశేఖర్‌బాబు తెలిపారు.
"గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకే ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఇ-పహరాలో గంజాయి స్థావరాలు, విక్రేతలు, విక్రయ ప్రాంతాలను జియో టాగింగ్ ఇప్పటికే చేశాం. వారిపై నిరంతరం నిఘా పెట్టటంతో పాటు రౌడీషీటర్లు, బ్లేడ్‌బ్యాచ్‌పై ప్రత్యేక నిఘా ఉంచాం. దీనిని సమూలంగా నిర్మూలించాలన్న ప్రభుత్వ ఆశయ సాధనకు కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా యాంటీ నార్కోటిక్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నారు." - రాజశేఖర్‌బాబు, విజయవాడ సీపీ
సూత్రధారులు విశాఖ జిల్లావాసులు : మరోవైపు నిందితులంతా విశాఖ జిల్లాలోని ఇద్దరి నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కొయ్యూరు మండలం డౌనూరు గ్రామానికి చెందిన పోలేజీ సాయి (22), విశాఖ జిల్లా కొయ్యూరు గుమ్మడివారిపాలెంకు చెందిన కాకాని దేవరాజు (28)గా నిర్ధారించారు. వీరు ఏజెన్సీ గ్రామాల్లోని గిరిజనుల నుంచి తక్కువ ధరకు గంజాయికి కొనుగోలు చేసి, వాటిని ఎక్కువ ధరకు వీరికి విక్రయిస్తున్నట్లుగా తేలింది. సూత్రధారులైన ఆ ఇద్దరిని కూడా ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడలో నేరాలపై ఈ-పహారా - గస్తీ విధానంలో సరికొత్త మార్పులు - E Pahara police patrolling