Telugu Woman Usha Chilukuri Vance : అమెరికా నూతన ఉపాధ్యక్షుడిగా పనిచేయనున్న జేడీ వాన్స్ విజయం సాధించడంతో తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరులో సంబరాలు జరుపుకొన్నారు. జేడీ వాన్స్ ఆంధ్రా అల్లుడే. ఆయన భార్య, అమెరికాకు సెకండ్ లేడీగా వ్యవహరించబోతున్నారు. ఉష చిలుకూరి తెలుగు సంతతి మహిళ. విజయనగరంలోని సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో బోధిస్తున్న ప్రొఫెసర్ శాంతమ్మ(96)కు ఉష మనవరాలి వరుస అవుతారు. ఐదు నెలల క్రితం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా వాన్స్‌ను ఎంపిక చేసినప్పుడే ఉష పేరు మారుమోగింది.
బంధువుల హర్షాతిరేకాలు : ఉష తాత రామశాస్త్రి మేనకోడళ్లయిన పారిపూడి నాగమణి, దువ్వూరి విజయలక్ష్మి తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరులో నివసిస్తున్నారు. వాన్స్ గెలుపుతో స్థానికులు మిఠాయిలు పంచి, బాణసంచా కాల్చారు. వడ్లూరులోని 20 సెంట్ల స్థలాన్ని చిలుకూరి కుటుంబ సభ్యులు గ్రామానికి దానమిచ్చారని మాజీ సర్పంచి పెనమత్స శ్రీనివాసరాజు పేర్కొన్నారు. అందులో సాయిబాబా ఆలయం, కల్యాణ మండపం నిర్మించామని చెప్పారు.
ఉష పూర్వీకులది కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం. ఆ కుటుంబంలోని పలువురు దశాబ్దాల కిందటే ఇక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు, చెన్నైకి, అమెరికాకు వలస వెళ్లారు. విశాఖలో స్థిరపడిన శాంతమ్మ భర్త, తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేసిన చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి తల్లిదండ్రులకు ఐదుగురు సంతానం. వారిలో పెద్ద కుమారుడు ఆచార్య రామశాస్త్రి మద్రాస్ ఐఐటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆయన నాలుగో కుమారుడు రాధాకృష్ణ కుమార్తెనే ఉష. రాధాకృష్ణ పామర్రుకు చెందిన లక్ష్మిని పెళ్లి చేసుకున్నారు.
ఏరో నాటికల్ ఇంజినీరైన రాధాకృష్ణ, మాలిక్యులర్ బయాలజీ, బయో కెమిస్ట్రీ రంగ నిపుణురాలైన లక్ష్మి1980ల్లోనే అమెరికా వలస వెళ్లారు. వీరి ఇద్దరి సంతానంలో ఉష ఒకరు. ఉష కృష్ణా జిల్లాకు ఒక్కసారి కూడా రాలేదు. కాలిఫోర్నియాలోని శాండియాగోలో 1986లో జన్మించిన ఆమె యేల్ విశ్వవిద్యాలయం నుంచి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. కేంబ్రిడ్జి నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ చేశారు. యేల్ వర్సిటీలోని న్యాయ సంబంధ విభాగాల్లో ఉష సుదీర్ఘంగా పనిచేశారు.
యేల్ వర్సిటీలోనే వాన్స్‌తో పరిచయం : యేల్ లా స్కూల్‌లో తొలిసారి కలుసుకున్న ఉష, వాన్స్ ఒకరినొకరు ఇష్టపడ్డారు. 2014లో కెంటకీలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. వీరికి ఇవాన్, వివేక్, మిరాబెల్ అనే ముగ్గురు సంతానం. భర్త విజయంలో ఉష కీలక పాత్ర పోషించారు. అయితే, ఆమె 2014లో డెమోక్రటిక్ పార్టీ కార్యకర్తగా తన పేరును నమోదు చేసుకోవడం గమనార్హం.
'అమెరికా సెకండ్ లేడీ నా మనవరాలు' - ఈ అవకాశం రావడం గొప్ప విషయం
మిసెస్ వైస్ ప్రెసిడెంట్ - బ్యూటీఫుల్ అంటూ ట్రంప్ కితాబు! ఇంతకీ ఎవరీ తెలుగమ్మాయి?