Unknown Persons Murder Old Woman for Gold : విజయనగరం జిల్లా బాడంగి మండలం మండలంలోని ముగడ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఒంటరిగా ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలు గద్దె కృష్ణవేణి (66)ని దొంగలు దారుణంగా చంపి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. ఈ ఘటనతో గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌ఐ జయంతి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వృద్ధురాలిని చంపేసి ఆమె వద్ద బంగారు పుస్తెలతాడు, నాలుగు బంగారు గాజులు, మూడు చేతి ఉంగరాలు, ఒక జత చెవి దిద్దులు సుమారుగా అరున్నర తులాల బంగారాన్ని చోరీ చేశారని ఎస్‌ఐ తెలిపారు.
జాగ్రత్త - ఇంటికి తాళం వేశారో అంతా మాయమే - Thieves Robbery at House In kadapa
20 ఏళ్ల క్రితం దత్తిరాజేరు మండలం దత్తి నుంచి భర్త నారాయణప్పలనాయుడు ఉపాధ్యాయ వృత్తి నిమిత్తం బాడంగి మండలం వచ్చి ముగడ కాలనీలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వీరి కుమారులు పెళ్లిళ్లయి విశాఖ, పాలకొండలో ఉంటున్నారు. 2018లో భర్త చనిపోవడంతో ఆయనపై ఉన్న మమకారంతో ఆ ఇంట్లోనే కృష్ణవేణి ఒక్కరే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఇంట్లో ప్రవేశించిన దొంగలు ఆమెను చంపేసి, వంట గదిలో గ్యాస్ లీక్ చేసి వెళ్లిపోయారు.
గుడ్డతో గొంతు బిగించి చంపేసినట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున పక్క ఇంట్లో ఉన్న తెంటు లక్ష్మి చూసి పాలకొండలో ఆమె కుమారుడు నాగేంద్ర కుమార్‌కు ఫోన్ చేసి "గ్యాస్ లీక్ అవుతుంది, అమ్మకు ఫోన్ చేసి బయటకి వచ్చేయమని చెప్పు" అంటూ సమాచారం ఇచ్చింది. ఆయన తన తల్లికి ఫోన్ చేయగా, ఆమె లిఫ్ట్ చేయకపోవడంతో ఎంపీటీసీ దేవరాపల్లి శ్రీనుకు ఫోన్ చేసి వెళ్లాలని కోరారు. ఆయన వచ్చి చూసేసరికి అప్పటికే ఆమె మృతి చెందింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్ వచ్చి పరిశీలించింది.
గతంలో ఎన్నడూ జరగని దుర్ఘటన చోటు చేసుకోవడంతో కాలనీ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా ఒంటరి మహిళల్లో ఆందోళన ప్రారంభమైంది. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని సీఐ నాగేశ్వరరావు తెలిపారు.