Union Minister Launches Mineral Exploration Event : మినరల్స్‌ను చాలా వరకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, దిగుమతిని వీలైనంత తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇతర దేశాలపై ఆధారపడకుండా మన కాళ్లపై మనం నిలబడే విధంగా ఆత్మనిర్భర భారత్ దిశగా కృషిచేస్తున్నామని పేర్కొన్నారు. మినరల్స్, బొగ్గు తదితర వంటివాటిపై ఇతర దేశాలపై ఆధారపడకూడదని నిర్ణయించామన్నారు.
ఈ దిశలో అన్ని రాష్ట్రాల సహకారం తీసుకుని ముందుకువెళతాం అన్నారు. క్రిటికల్ మినరల్స్‌ను కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షణ చేసి రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వాటిని మైనింగ్ చేసే దిశగా ముందుకెళతామన్నారు. బేగంపేటలోని ఓ హోటల్లో జరిగిన మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ హ్యాకథాన్, క్రిటికల్ మినరల్ రోడ్ షో ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మైనింగ్ రంగంలో మరింత అభివృద్ధి సాధనే లక్ష్యంగా కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోదు : డిస్ట్రిక్ మినరల్ ఫండ్ (డీఎంఎఫ్) పోర్టల్‌ను కిషన్‌రెడ్డి ప్రారంభించారు. పారదర్శకంగా మినరల్, మైనింగ్ కార్యకలాపాలు చేపట్టాలని, అన్వేషణ చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. అందుకు అవసరమైన చట్టాలలో మార్పులు తీసుకువచ్చామని, భవిష్యత్‌లో కూడా మరిన్ని మార్పులు తీసుకువస్తామన్నారు.
మైన్స్‌లో కానీ, బొగ్గులో ఎంత ఆదాయం వస్తుందో, ఆ మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలకే చేరుతుందన్నారు. అందులో కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోదని స్పష్టం చేశారు. బొగ్గు ఉత్పత్తి, మినరల్స్‌లో వచ్చే ఆదాయం విషయంలో కానీ కేంద్రం జోక్యం చేసుకోదన్నారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలకు తగినంత ఆదాయం వచ్చేది కాదని, అందుకు ఒడిశా రాష్ట్రమే ఉదాహరణ అని పేర్కొన్నారు.
Mineral Exploration Hackathon : ప్రస్తుతం ఒడిశా రాష్ట్రానికి ప్రతి ఏడాది రూ.40వేల కోట్లు మైనింగ్ ద్వారా ఆదాయం సమకూరుతుందన్నారు. ప్రతి జిల్లాలో కూడా మైనింగ్ ప్రభావిత ప్రజలను ఆదుకునేందుకు డిస్ట్రిక్ మినరల్ ఫండ్‌ను జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఏర్పాటు చేశామన్నారు. 625 జిల్లాల్లో డీఎంఎఫ్‌ను ఏర్పాటు చేశామన్నారు. లక్ష కోట్ల రూపాయల నిధులను ఆయా జిల్లాలకు ఇప్పటికే కేటాయించామన్నారు.
ఆయా జిల్లాలకు వచ్చే రాయల్టీ ఆధారంగా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఆ జిల్లాలో ఉన్న మైనింగ్ ప్రభావిత పేద ప్రజలకు, మైనింగ్ వల్ల భూములు కోల్పోయిన వారికి ఖర్చుపెట్టి, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో వారి జీవితాల్లో వెలుగులు తీసుకువస్తున్నామన్నారు. ఒడిశా ప్రభుత్వంతో మాట్లాడి సింగరేణి పరిశ్రమకు నైనీ కోల్ బ్లాక్‌ను కేటాయించేలా చొరవ చూపామన్నారు. తద్వారా మూడు వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 49శాతం వాటా ఉందని, సింగరేణిని మైనింగ్‌లో, మార్కెటింగ్‌లో మరింత పటిష్ఠం చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తరఫున సింగరేణికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం అన్నారు.