BANDI SANJAY SLAMS CM REVANTH : కవితకు బెయిల్ ఇవ్వాలా? వద్దా? అనేది న్యాయ స్థానం పరిధిలోని అంశమని, కవిత బెయిల్‌కు బీజేపీకి ఏం సంబంధమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ త్వరలో విలీనమవుతుందని, అందులో భాగంగానే కవితకు బెయిల్ రాబోతుందంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఆమ్‌ఆద్మీ పార్టీని బీజేపీలో విలీనం చేసుకుంటేనే దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు బెయిల్ వచ్చిందా అని బండి ప్రశ్నించారు.
బీఆర్ఎస్‌ది ముగిసిన అధ్యాయం : ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ రాజకీయ లబ్ది కోసం గౌరవ న్యాయస్థానంపై బురద చల్లి కోర్టుల ప్రతిష్ఠను తగ్గించడం దుర్మార్గమని బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీని బద్నాం చేసేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌ది ముగిసిన అధ్యాయమని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ప్రజలు ఛీత్కరించిన ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి లేదన్నారు.
కాంగ్రెస్‌లో విలీనం తథ్యం : బీఆర్ఎస్‌ను విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ తహతహలాడుతోందని బండి సంజయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పథకం ప్రకారమే ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అతి త్వరలోనే కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనమవడం తథ్యమని జోస్యం చెప్పారు. కేసీఆర్‌ను ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్‌ను పీసీసీ చీఫ్, హరీశ్‌రావుకు మంత్రి పదవి, కవితకు రాజ్యసభ సీటు ఖాయమన్నారు. నువ్వు కొట్టినట్లు చేయ్, నేను ఏడ్చినట్లు చేస్తానన్నట్లు చేస్తా అని కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరుందని ఎద్దేవా చేశారు.
త్వరలో రాజ్యసభ ఎన్నికలొస్తున్నందున కవితను కాంగ్రెస్ పక్షాన రాజ్యసభకు పంపినా ఆశ్చర్యపోనక్కర్లేదని బండి సంజయ్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కాళేశ్వరం సహా అనేక అంశాల్లో వేల కోట్ల రూపాయల అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ కేసీఆర్, కేటీఆర్‌లను జైలుకు పంపాలని ఆయన సవాల్ విసిరారు. కేసీఆర్ కుటుంబ ఆస్తులను జప్తు చేయాలని బండి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దాగుడుమూతలాడుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
బీఆర్ఎస్తో బీజేపీ చర్చలు జరుపుతుందనేది అవాస్తవం : బండి సంజయ్ - Bandi Sanjay Comments On BRS
మీ తప్పు కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై నిందలా? : బండి సంజయ్ - BANDI SANJAY SLAMS CONGRESS GOVT