Central Minister Bandi Sanjay Letter to Cm Revanth : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. గురుకుల విద్యాలయాలకు రూపొందించిన కొత్త టైం టేబుల్ పని వేళలను కుదించాలని లేఖలో పేర్కొన్నారు. ఉదయం 5 నుంచి రాత్రి 9.30 గంటల వరకు పని వేళలు రూపొందించడం వల్ల నిద్రలేమి, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారన్నారని తెలిపారు. రాత్రిపూట స్టడీ అవర్, కేర్ టేకర్ విధులను కూడా టీచర్లకు అప్పగించడం సరికాదన్నారు.
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పోలీసులు : వార్డెన్ల పోస్టులు మంజూరైనా భర్తీ చేయకపోవడం బాధాకరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. తక్షణమే వార్డెన్ పోస్టులను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా పోలీసులకు నెలల తరబడి టీఏ, డీఏ, పీఆర్సీ, సరెండర్ లీవ్ బిల్స్ చెల్లించకపోవడం దారుణం అన్నారు. వివిధ విభాగాల్లోని దాదాపు వెయ్యి మంది పోలీసులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బకాయిలను చెల్లించిన ప్రభుత్వం, కరీంనగర్ జిల్లా పోలీసులను పట్టించుకోకపోవడం బాధాకరం అన్నారు. తక్షణమే టీఏ, డీఏ, పీఆర్సీ బకాయిలతో పాటు సరెండ్ లీవ్ బిల్స్ చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
రాజీనామా చేశాకే బీజేపీలోకి చేరాలి : మరోవైపు ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, నేతలు బీజేపీలో చేరాలంటే ముందుగా వారి పదవులకు రాజీనామా చేయాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ఈడీ, సీబీఐ కేసులు ఉన్న నాయకులను తమ పార్టీలోకి తీసుకునే అవకాశాలు లేవని స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్లోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈడీ, సీబీఐ సంస్థల విచారణకు తమ పార్టీకి సంబంధంలేదని, ప్రధాని మోదీ ప్రభుత్వం అవినీతిపరులను ఉపేక్షించదని అన్నారు. ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్, బీఆర్ఎస్లో మాదిరిగా రాజీనామా చేయకుండా బీజేపీలోకి వచ్చే అవకాశంలేదని స్పష్టం చేశారు.