Union Minister Anurag Singh Thakur On Phone Tapping : తెలంగాణలో టెలిగ్రాఫ్ చట్టాన్ని ఉల్లంఘించి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే, కేంద్రం చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. ఎవరి ఫోన్‌నైనా ట్యాప్ చేయాలంటే, తప్పనిసరిగా ప్రత్యేక అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన బుధవారం దిల్లీలోని తన నివాసంలో ప్రాంతీయ పత్రికల మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తెలంగాణ పరిస్థితులపైనా స్పందించారు.
తెలంగాణలో బీజేపీ రెండంకెల సంఖ్యలో సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ చేసిన పోరాటమే అందుకు కారణమన్నారు. కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన పార్టీ బీజేపీ ఒక్కటేనని చెప్పారు. దానివల్లే తమ ఓటు బ్యాంకు 7 శాతం నుంచి 14 శాతానికి పెరిగిందని తెలిపారు. రాష్ట్రానికి మేలు జరగాలంటే, లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి, బీజేపీకి ఓటేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని ధీమా వ్యక్తం చేశారు.
Anurag Singh Thakur Comments : రాష్ట్ర పునర్విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని రైలు, రోడ్డు ప్రాజెక్టులు చాలా ఇచ్చామని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. గిరిజన విశ్వవిద్యాలయానికి భూమి ఇవ్వడానికి గత కేసీఆర్ ప్రభుత్వం ఆరేళ్లు స్పందించకపోవడం వల్లే ఆలస్యం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పునకు కేంద్రాన్ని బాధ్యుల్ని చేయకూడదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని తమ పార్టీ నాయకులెవరూ అనలేదన్నారు. అక్కడ ప్రభుత్వం ఏర్పాటుకు 61 మంది ఎమ్మెల్యేలు కావాలని, తమకు 8 మంది మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ ఒక ఫామ్‌హౌస్ పార్టీ : బీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి పార్టీలో ఉన్న నేతలు వదిలిపోతున్నారని, దాన్ని తాము ఏదో చేయాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ను వదిలిన వారు బీజేపీకే రావడం లేదని, కాంగ్రెస్‌లోనూ చేరుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ఒక కుటుంబానికి చెందిన ఫామ్‌హౌస్ పార్టీ అని విమర్శించారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి ఆఫీసుకే రాకపోతే ఫామ్‌హౌస్ వరకు ఎంత మంది పోగలుగుతారని ప్రశ్నించారు. ఆ బాధను భరించలేకే ఆ పార్టీ నాయకులు వీడిపోతున్నారని విమర్శించారు.
"బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నాయన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు. బురదచల్లడం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఇదివరకు కవితను అరెస్ట్ చేయలేదని ఆరోపించారు. ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఎందుకు చేశారని ప్రశ్నిస్తున్నారు. ఏదో ఒక వాదనకు కట్టుబడి ఉండాలి తప్ప అటూఇటూ మాట్లాడకూడదు" అని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అన్నారు.
కాంగ్రెస్ నేతలు, మీడియా సంస్థలకు కేటీఆర్ లీగల్ నోటీసులు - KTR sent legal notices
అందరి ఫోన్లు ట్యాప్ చేశారు - నిందితులందరూ బయటకు వస్తారు : శ్రీధర్ బాబు - lok sabha elections 2024