Ugadi Festival Celebrations 2024 : తెలుగు వారి పండుగ ఉగాది రానే వచ్చేసింది. తెలుగు వాకిళ్లల్లో క్రోధి నామ సంవత్సరం సందడి నెలకొంది. ఏటా చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాదిగా నిర్ణయిస్తారు. ఆ పండుగను తెలుగువారే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు. ఐతే ఆ పండగను ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరిట పిలుస్తారు. మరాఠీలు "గుడిపడ్వా"గా పిలుస్తే తమిళులు "పుత్తాండు" అనే పేరుతో, మలయాళీలు "విషు" అని సిక్కులు "వైశాఖీ"గా, బెంగాలీలు "పోయ్‌లా బైశాఖ్"గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
Ugadi Pachadi Importance : సాధారణంగా తెలుగువాకిళ్లలో కొత్త సంవత్సరం అనగానే వెంటనే ప్రతి ఒక్కరికీ గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది. జీవితంలో వచ్చే కష్టసుఖాలను అందరూ అనుభవించాలని గుర్తుచేసేదే ఉగాది పచ్చడి. పలు రుచుల మేళవింపు అయిన ఉగాడి పచ్చడి కేవలం రుచికరమే కాదు ప్రభోదాత్మకం. తీపి వెనుక చేదు, పులుపు ఇలా పలు రుచులకు జీవితాన కష్టాలు, తదితర అనుభూతులు, ప్రతీకలే అనే నగ్నసత్యాన్ని చాటుతుంది.
షడ్రుచుల సమ్మేళనం : సుఖాలకు పొంగకు, దు:ఖానికి కుంగకు, సుఖదు:ఖాలని సమభావంతో స్వీకరించు అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుందీ ఉగాది పచ్చడి అని పండితులు తెలిపారు. ఎన్నో ఔషధగుణాలున్నపై షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ఉగాది పండుగ రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి పరగడుపున తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆహారంలో ఉండే ఔషధ గుణాలను స్వీకరిస్తూ, జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాం.
Huge Rush In Market Due To Ugadi Festival : పండగ వేళ మార్కెట్లన్నీ వినియోగదారులతో కిటకిటలాడాయి. ఉగాది పచ్చడితోపాటు కొత్త సంవత్సరానికి సంబంధించిన సామాగ్రిని కొనుగోలు చేసేందుకు పెద్దసంఖ్యలో వినియోగదారులు తరలివచ్చారు. గతంతో పోలిస్తే రేట్లు ఎక్కువగా ఉండటంతో పెద్దమొత్తంలో కొనుగోలు చేయలేకపోయినట్లు వినియోగదారులు తెలిపారు. గతంతో పోలిస్తే అమ్మకాలు అంతగా లేవని విక్రయదారులు చెబుతున్నారు. ఉగాది రోజున పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా మంచి జరుగుతుందని అంతా భావిస్తుంటారు.
ఉగాది పచ్చడి కోసం మామిడికాయలు, చింతపండు, వేప పువ్వు కొన్నాం. గతంతో పోలిస్తే ఈసారి రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఎండలు ఎక్కువగా ఉండటంతో బయటికి రావడానికి ఇబ్బందిగా ఉంది. ఈరోజు పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా మంచి జరుగుతుందని భావిస్తున్నాం -వినియోగదారులు
క్రోధి నామ సంవత్సరం రాశి ఫలాలు- వారికి ఆదాయం 2, వ్యయం 14! - Ugadi Rasi Phalalu 2024