Uddandapur Reservoir Issues : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉద్దండపూర్ వద్ద జలాశయం నిర్మిస్తున్నారు. భూములిచ్చిన నిర్వాసితులు, న్యాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఉదండపూర్, వల్లూరు సహా ఏడు తండాలకు చెందిన గ్రామస్తులు సాగు భూములు, ఇళ్లు, ఇతర స్తిరాస్థుల్ని కోల్పోయారు. భూములకు పరిహారం అందగా, ఇళ్లు నిర్మించి పునరావాసం కల్పించాల్సి ఉంది.
2016లో ప్రాజెక్టు పనులు ప్రారంభం కాగా ఇప్పటివరకు నిర్వాసితుల సమస్యలకు పరిష్కారం చూపలేదు. తమకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు ముంపు గ్రామాలను ఖాళీ చేసిది లేదని తెగేసిచెబుతున్నారు. ఏడేళ్లలో గ్రామాల్లోని ఇళ్లు శిథిలావస్థకు చేరాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. అభివృద్ధి కుంటుపడింది. చుట్టూ జలాశయం పనులు జోరుగా సాగడంతో, వ్యవసాయ భూములు లేకుండా పోయాయి. ఉపాధి కరవైంది. వానాకాలం వస్తే చాలు, ఎక్కడ వరద నీరు చుట్టుముడుతుందోనే భయం వారిని వెంటాడుతోంది.
హామీలు అమలు చేయాలి : తమకు న్యాయం చేసే వరకు, ఉద్దండపూర్ జలాశయం పనులు సాగనివ్వబోమని అడ్డుకుని తీరతామని నిర్వాసితులు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల పరిహారాన్ని 25 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. ఏడేళ్లలో వివిధ కారణాలతో చనిపోయిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వారి కుటుంబాలకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. బడ్జెట్‌లో ఉద్దండపూర్కు పైసా కేటాయించని ప్రభుత్వం, పరిహారం ఎలా చెల్లిస్తుందని ప్రశ్నిస్తున్నారు.
మంత్రుల పర్యటన : ముంపు గ్రామాన్ని వదిలి వెళ్లిపోదామన్నా, పునరావాస గ్రామంలో మౌలిక వసతుల కల్పన ఇప్పటికీ పూర్తి కాలేదు. పాలమూరు ప్రాజెక్టుల సందర్శనకు వస్తున్న నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జిల్లా ఇంఛార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి జూపల్లి కృష్ణారావులు తమ మొర ఆలకించాలని వేడుకుంటున్నారు. మరోవైపు భీమా ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన శంకర సముద్రం జలాశయం సైతం 90 శాతం పనులు పూర్తై అసంపూర్తిగా ఉంది.
పునరావాస గ్రామంలో ఇళ్ల స్థలాలను చదును చేసి, డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టు పనులను పరిశీలించనున్న అమాత్యులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు నిర్వాసితులతో మాట్లాడనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తుందని నిర్వాసితులంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.
"మేము ప్రాజెక్టు నిర్మాణంలో అన్ని కోల్పోయాము. మాకు న్యాయం చేసే వరకు, ఉద్దండపూర్ జలాశయం పనులు సాగనివ్వబోము. ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల పరిహారాన్ని రూ.25 లక్షలకు పెంచాలి. పునరావాస గ్రామంలో ఇళ్ల స్థలాలను చదును చేసి, డబుల్ బెడ్ రూం ఇళ్లు ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలి". - నిర్వాసితులు, ఉద్దండాపూర్