Two Telugu Students Died In America : అమెరికాలో తెలుగు విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్న వేళ మరో విషాదం చోటుచేసుకుంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు పట్టా అందుకున్న కొద్ది రోజులకే మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు విద్యార్థులు ఆరిజోనాలోని ప్రసిద్ధ ఫాజిల్ క్రీక్ జలపాతంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
లక్కిరెడ్డి రాకేశ్‌రెడ్డి (23), రోహిత్ మణికంఠ రేపాల (25) ఆరిజోనా విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు. చదువు విజయవంతంగా పూర్తిచేసి ఎంఎస్ పట్టా పొందిన సందర్బంగా 16 మంది స్నేహితులు కలిసి ఈ నెల 8న జలపాతం వద్దకు వెళ్లారు. అక్కడ సరదాగా గడుపుతున్న సమయంలో రాకేశ్, రోహిత్‌లు ప్రమాదవశాత్తూ ఒక్కసారిగా జలపాతంలో మునిగిపోయారు. గమనించిన స్నేహితులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అమెరికాలో రోడ్డు ప్రమాదం - ఇద్దరు తెలంగాణ విద్యార్థులు మృతి - Telangana Students Died In America
Telangana Students Died In America : సంఘటనా స్థలానికి చేరుకున్న అక్కడి పోలీస్ సిబ్బంది రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకి దొరకలేదు. మరుసటి రోజు గజ ఈత గాళ్లతో గాలించగా 25 అడుగుల లోతులో ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. వీరిలో రాకేశ్‌రెడ్డి ఖమ్మం నగరానికి చెందిన మాంటిస్సోరి, తెలంగాణ నారాయణ పాఠశాలల అధినేతల్లో ఒకరైన లక్కిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, పద్మ దంపతుల ఏకైక కుమారుడు.
కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. గత వారం ఆరిజోనా విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్ పట్టా పొందాడు. కుమారుడు పట్టా తీసుకుంటున్న ఆనందాన్ని పంచుకునేందుకు తల్లిదండ్రులు కూడా అమెరికా వెళ్లారు. కుమారుడితో సంతోషంగా కొన్ని రోజులు ఉండాలని వెళ్లిన తల్లిదండ్రులు ఇప్పుడు అతని మృతదేహాన్ని తీసుకుని ఇంటికి రావాల్సిన హృదయవిదారక పరిస్థితి ఏర్పడింది. ఒకటి రెండు రోజుల్లో మృతదేహాన్ని ఖమ్మం రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.
రాకేశ్‌రెడ్డి చిన్ననాటి నుంచే చదువుల్లో చురుగ్గా ఉండేవాడని క్రీడల్లో సైతం రాణించేవాడని బంధువులు తెలిపారు. బీటెక్ పూర్తిచేసిన తర్వాత ఓ ప్రముఖ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చినా వెళ్లకుండా ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడన్నారు. రాకేశ్‌రెడ్డితో గడిపిన రోజులను గుర్తుకు తెచ్చుకుని స్థానికులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కాగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎంఎస్ చేసిన రోహిత్ వివరాలు తెలియాల్సి ఉంది.
America Accident: పక్షం రోజుల్లో ఇంటికి రావాల్సిన విద్యార్థులు అమెరికా రోడ్డు ప్రమాదంలో..