Sons Attacked Father in Gadwal : పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు వారే తమ సర్వస్వమని, కడవరకు చూస్తారని నమ్ముతారు. తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారి బాగోగులను చూసుకుంటారు. వారికి ఏ చిన్న కష్టం వచ్చినాసరే తమ ప్రాణం పోయేంతలా కన్నవారు విలవిలలాడుతారు. తీరా వారు పెరిగి పెద్దవారైన తర్వాత అమ్మానాన్నలే అవసరం లేదని చెప్పేసిన కుమారులు, కుమార్తెలు కూడా ఈ లోకంలో ఉన్నారు.
కన్నవాళ్ల దగ్గర నుంచి ఆస్తులు కావాలి కానీ కన్నవారు మాత్రం అవసరం లేదు. వారిని కన్న పాపానికి చివరకు వారికి వృద్ధాప్యంలో కనీసం తిండి కూడా పెట్టడం లేదు. పిల్లలు తమను కొడుతున్నా బిక్కుబిక్కుమంటూ కాటికి కాలు చాపి కన్నుమూసే క్షణం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం కాస్త ధైర్యం చేసి పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది.
ఇదీ జరిగింది : చద్దన్నం తినలేనని, వేడి అన్నం కావాలని అడిగినందుకు కన్నతండ్రిపై ఇద్దరు కుమారులు దాడికి పాల్పడ్డారు. ఈ హృదయ విదారక ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన నాయక కృష్ణయ్య, మద్దమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె సంతానం. మద్దమ్మ కొన్నేళ్ల కిందట చనిపోయింది. వివాహానంతరం ఇద్దరు కుమారులు ఇంటిని రెండు వాటాలుగా పంచుకున్నారు. తండ్రి కృష్ణయ్య చిన్న కుమారుడి వద్దే ఉంటున్నారు.
చద్దన్నం వద్దని వారించినందుకు దాడి : బుధవారం రాత్రి భోజనానికి కూర్చున్న కృష్ణయ్య.. కోడలు చద్దన్నం పెడుతుండటాన్ని గుర్తించి వారించారు. వేడి అన్నం కావాలని అడిగిన నేపథ్యంలో కోడలికి, మామకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడే ఉన్న చిన్న కుమారుడు సర్దిచెప్పడానికి బదులు కర్రతో దాడి చేశాడని వీపు భాగం, కాళ్లపై వాతలు తేలేలా కొట్టాడని కృష్ణయ్య ఆరోపించారు. అక్కడే ఉన్న పెద్ద కుమారుడు కూడా దాడి చేయడంతో కళ్లపైనా గాయాలయ్యాయని కన్నీటిపర్యంతమయ్యారు.
6 కిలోమీటర్లు నడిచి ఠాణాకు : కుమారులు కొట్టడంతో ప్రాణభయంతో అర్ధరాత్రి ఇంట్లోంచి వచ్చేసిన కృష్ణయ్య జల్లాపురం నుంచి 6 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ మానవపాడు ఠాణాకు చేరుకున్నారు. రాత్రి అక్కడే నిద్రించి గురువారం ఉదయం ఫిర్యాదు చేశారు. ఇటీవల తమ పొలం అమ్మగా వచ్చిన డబ్బులో రూ.3 లక్షలు తనకు ఇచ్చేందుకు కుమారులు అంగీకరించారని, ఆ డబ్బు కూడా ఇప్పించాలని ఫిర్యాదులో కోరారు. ఆయన ఫిర్యాదు మేరకు ఇద్దరు కుమారులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.