Two people Arrested In Investment Fraud in Hyderabad : కేరళకి చెందిన నౌషద్, కబీర్, ఇసాక్, తాహిర్ అలీ అనే నలుగురు వ్యక్తులు తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో సైబర్ నేరాలకు అలవాటు పడ్డారు. ఇసాక్, తాహిర్ పెట్టుబడులకు లాభాల పేరుతో సైబర్ మోసాలు చేస్తుంటారు. నౌషద్, కబీర్ నకిలీ ధ్రువపత్రాలతో మొత్తం 18 బ్యాంకు ఖాతాలు తెరిచారు.
నిరుద్యోగులను ఆసరాగా చేసుకొని పార్ట్‌టైమ్ జాబ్ ఉందని నమ్మించి టెలిగ్రామ్, ఇతర సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తారు. ఎవరైనా అమాయకులు స్పందిస్తే లైకులు, రేటింగ్ ద్వారా కామెంట్లు ఇవ్వాలని ఉసిగొల్పుతారు. బదులుగా తాము కమీషన్ ఇస్తామని నమ్మిస్తారు. టాస్కుల పేరుతో రేటింగులు ఇచ్చాక పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని ఆశ చూపిస్తారు. తద్వారా ముందుకొచ్చిన వారి నుంచి డబ్బు వసూలు చేసి తర్వాత అడ్రస్ లేకుండా పోతారు.
Kerala Cyber Criminals Arrested by Hyderabad Police : ఈ ఏడాది జనవరిలో నగరానికి చెందిన ఓ బాధితుడికి టెలిగ్రామ్‌లో సందేశం వచ్చింది. తాత్కాలిక ఉద్యోగం ఉందని టెలిగ్రామ్ గ్రూపులో చేర్చి లింకు పంపించారు. నిందితుల సూచన మేరకు బాధితుడు ఓ యాప్ డౌన్‌లోడ్ చేశాడు. కొన్ని కంపెనీలకు ఫైవ్ స్టార్ రేటింగ్, కామెంట్లు పెట్టాలని చెప్పి కొంత మొత్తం డబ్బును బాధితుడి బ్యాంకు ఖాతాకు పంపారు. ఆ తర్వాత నమ్మించి పెట్టుబడికి లాభాలు ఇస్తామని రూ.9లక్షల 44 వేలు వసూలు చేశారు. తర్వాత మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
టాస్క్ పూర్తి చేస్తే డబ్బులు చెల్లిస్తామని నమ్మబలికారు - రూ.49.45 లక్షలు దోచుకున్నారు
బాధితుల నుంచి వసూలు చేసిన సొమ్మును ఈ సైబర్ నేరగాళ్లు కొత్తగా తెరిచిన బ్యాంకు ఖాతాల్లో జమ చేసి ఆ తర్వాత క్రిప్టో కరెన్సీలోకి మళ్లిస్తున్నారు. ఈ క్రిప్టో కరెన్సీని దుబాయ్‌లో అమెరికన్ డాలర్లుగా మారుస్తున్నారు. ఇదే డబ్బును వేర్వేరు బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి చట్టబద్ధంగా మారుస్తున్నారు. పోలీసులు బ్యాంకు ఖాతాలు ఇతర సాంకేతిక ఆధారాలతో ఆరా తీయగా మొత్తం మోసం బయటపడింది. ఈ వ్యవహారంలో సూత్రధారులు నౌషద్, కబీర్‌లను అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులు ఇప్పటి వరకూ 18 ఖాతాల ద్వారా రూ.26 కోట్ల లావాదేవీలు నిర్వహించినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు.
"పార్ట్‌టైమ్ జాబ్ ఇస్తామని చెప్తారు. అసక్తి చూపించినవారికి టాస్క్‌లు పూర్తి చేసి వారికి వచ్చిన డబ్బులతో పెట్టుబడులు పెట్టిస్తారు. ముందుగా వారికి లాభాలు చూపిస్తారు. తర్వాత అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టించి వారికి లాభాలు రాకుండా అకౌంట్లు బ్లాక్ చేస్తారు. తర్వాత దీనిపై నేరగాళ్లకు ఫోన్ చేస్తే ఇంకా పెట్టుబడులు పెడ్తే లాభాల వస్తాయని చెబుతారు. ఇలా వారి దగ్గర నుంచి డబ్బులు దోచుకుంటారు." - కవిత , హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ
online Business Frauds : తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు.. నమ్మి అత్యాశకు పోతే అసలుకే మోసం
సైబర్ నేరగాళ్ల నయామోసం - లక్షపెట్టుబడి పెడితే 40 రోజుల పాటు రూ.10 వేలు