తిరుమలలో భారీ వర్షం - వాహనదారులకు కీలక సూచనలు చేసిన టీటీడీ - HEAVY RAINS IN TIRUMALA
తిరుపతి జిల్లావ్యాప్తంగా ఎడతెరిపిలేని భారీ వర్షాలు - అప్రమత్తమైన టీటీడీ - పాపవినాశనం, శ్రీవారిపాదాలకు వెళ్లే మార్గాలు తాత్కాలికంగా మూసివేత
Published : Dec 12, 2024, 12:36 PM IST
|Updated : Dec 12, 2024, 12:58 PM IST
Heavy Rains in Tirumala Today : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లావ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో తిరుపతి వీధులన్ని జలమయమయ్యాయి. తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దర్శనానంతరం లడ్డూ విక్రయ కేంద్రాలకు, గదులకు వెళ్లే భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద తలదాచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో టీటీడీ సైతం అప్రమత్తమై పాపవినాశనం, శ్రీవారిపాదాలకు వెళ్లే మార్గాలు తాత్కాలికంగా మూసివేసింది.
ఈ క్రమంలో అధికారులు వాహనాల రాకపోకలను దారి మళ్లించారు. బాలాజీ కాలనీ నుంచి మహిళా వర్శిటీ మీదుగా వాహనాలను మళ్లించారు. భక్తులను కపిలతీర్థం పుష్కరిణికి వెళ్లకుండా టీటీడీ అధికారులు నిలిపివేశారు. కాగా తిరుపతి లక్ష్మీపురం కూడలిలో, గొల్లవానిగుంట లోతట్టు ప్రాంతాల్లో వరద నీటి ప్రవాహం పెరిగింది. గోగర్భం, పాపనినాశనం జలాశయాలు సైతం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. భారీ వర్షం వల్ల వెస్ట్ చర్చి కూడలిలో రైల్వే అండర్ బ్రిడ్జి వర్షపు నీటితో నిండిది.
అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు : తిరుపతి జిల్లాలో అప్రమత్తంగా ఉండాలంటూ ఇన్ఛార్జ్ శుభం బన్సాల్ అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు ఉండడంతో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని, అదే విధంగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవరసమైతే తప్ప ఎట్టిపరిస్థితిలోనూ ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. మరోవైపు పిచ్చాటూరు మండలంలోని అరణియార్ ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. ఈ మేరకు అధికారులు ఉదయం 11 గంటలకు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షం : మరోవైపపు అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షం పడుతోంది. రాజంపేట నియోజకవర్గాల్లో మోస్తరు వర్షం పడుతుండగా పీలేరు, రాయచోటి, మదనపల్లెలో చిరుజల్లులు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు.
అలర్ట్ : బంగాళాఖాతంలో మరో వాయు'గండం' - ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!