Ramana Deekshitulu on Tirumala Laddu : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి వినియోగంపై పెద్ద దుమారం రేగుతోంది. కమీషన్ల కోసమే నాటి ఈవో ధర్మారెడ్డి అర్హత లేని కంపెనీకి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చారని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నారు. మరోవైపు గుజరాత్‌కు చెందిన ఎన్డీడీబీ కాఫ్ లిమిటెడ్ సంస్థ ఇచ్చిన నివేదికలో సైతం జంతువుల కొవ్వు ఉన్నట్లు నిర్ధారణ కావడంతో వైఎస్సార్సీపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీనిపై కూటమి ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏపీ సర్కార్ కూడా ఈ విషయంపై ఫోకస్ పెట్టింది.
తాజాగా ఇదే విషయంపై టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు స్పందించారు. తిరుమలలో ప్రసాదాల నాణ్యతపై గతంలో ఎన్నోసార్లు టీటీడీ ఛైర్మన్, ఈవో దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. కానీ అది లాభం లేకపోయిందన్నారు. పవిత్రమైన ఆవు నెయ్యిని కల్తీ చేసి శ్రీవారి ప్రసాదాల్లో వినియోగించడం అపచారమని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమలలో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
Tirupati Laddu Controversy : శ్రీవారి ప్రసాదాల నాణ్యతపై ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లానని రమణ దీక్షితులు పేర్కొన్నారు. కానీ తనది ఒంటరి పోరాటం అయిపోయిందని వాపోయారు. తోటి అర్చకులెవరూ వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకురాలేదని చెప్పారు. దీంతో గత ఐదు సంవత్సరాలు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయిందని ఆదేదన వ్యక్తం చేశారు. నెయ్యి పరీక్షలకు సంబంధించిన ల్యాబ్ రిపోర్టులు చూశానని రమణ దీక్షితులు వెల్లడించారు.
ఆ రిపోర్ట్‌లో నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు అందులో ఉందని రమణ దీక్షితులు వివరించారు. పరిశుభ్రమైన ఆవు పాలతో తయారైన నెయ్యిలో కొవ్వు పదార్థాలు కలిసేందుకు వీలు లేదని చెప్పారు. తిరుమలను ప్రక్షాళన చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. దీనికోసం ముఖ్యమంత్రి ఎన్నో చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. కర్ణాటకలోని నందిని డెయిరీ నుంచి నెయ్యిని వినియోగించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామని రమణదీక్షితులు తెలిపారు.
వైఎస్సార్సీపీ నేతలు తిరుమల లడ్డూనూ అపవిత్రం చేశారా? - రాజకీయ దుమారం - FAT IN TIRUMALA LADDU ISSUE