TTD EO Shyamala Rao about Tirupati Laddu : లడ్డూ నాణ్యతపై కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. లడ్డూ నాణ్యతపై పోటు సిబ్బందితో మాట్లాడానని, వారు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. లడ్డూ నాణ్యతగా ఉండాలంటే నెయ్యి నాణ్యంగా ఉండాలని చెప్పారని వివరించారు. నెయ్యి నాసిరకంగా ఉందని గుత్తేదారుకు చెప్పామని, నెయ్యిలో నాణ్యతా లోపాన్ని తాను కూడా గమనించినట్లు తెలిపారు. నెయ్యి నాణ్యత నిర్ధరణకు టీటీడీకి సొంత ప్రయోగశాల లేదని వ్యాఖ్యానించారు. నెయ్యి నాణ్యతపై అధికారులు గతంలో పరీక్షలు చేయలేదని తెలిపారు.
నాణ్యత నిర్ధారణకు బయట ల్యాబ్స్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి ఉందని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. రూ.320 నుంచి రూ.411కే కిలో నెయ్యి సరఫరా చేశారని తెలిపారు. నాణ్యమైన నెయ్యిని అంత తక్కువ ధరకు సరఫరా చేయలేరన్నారు. అంత తక్కువ ధరకు నాణ్యమైన నెయ్యి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తాము హెచ్చరించిన తర్వాత గుత్తేదారులు నాణ్యత పెంచారని పేర్కొన్నారు. 4 ట్యాంకర్లలోని నెయ్యిని 10 ప్రయోగ శాలలకు పంపామని తెలిపారు. నెయ్యి నాణ్యత నిర్ధారణ కోసం ఎన్‌డీడీబీ ల్యాబ్‌కు పంపినట్లు వివరించారు. ఎన్‌డీడీబీ ల్యాబ్ అనేది చాలా ప్రముఖమైనదని, అది గుజరాత్‌లోని ఆనంద్‌లో ఉందని తెలిపారు.
'తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్స్ సరఫరా ద్వారానే నెయ్యిలో కల్తీ జరిగింది. నెయ్యి కల్తీ అయిందని తేలిన వెంటనే చర్యలు చేపట్టాం. దీనిపై కమిటీ వేశాం. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం'-శ్యామలరావు, టీటీడీ ఈవో
నెయ్యి నాణ్యత 20 పాయింట్లే : ల్యాబ్ పరీక్షల్లోనే నెయ్యి నాణ్యత లేదని తేలిందని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. జులై 6న నెయ్యిని ప్రయోగ శాలలకు పంపామని, వారంలో ల్యాబ్ నివేదికలు వచ్చాయని వెల్లడించారు. ల్యాబ్ రిపోర్టు రెండు విభాగాలుగా ఇచ్చారని, నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్లు నివేదికలు తేల్చాయని స్పష్టం చేశారు. 100 పాయింట్లు ఉండాల్సిన నెయ్యి నాణ్యత 20 పాయింట్లే ఉందని తెలిపారు. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు ఎన్‌డీడీబీ తేల్చిందని అన్నారు. నెయ్యిలో తీవ్ర కల్తీ జరిగిందని తేలిన వెంటనే చర్యలు చేపట్టామని చెప్పారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కమిటీ కూడా వేశామని వెల్లడించారు.
నెయ్యి నాణ్యత పరికరాలను ఎన్‌డీడీబీ విరాళంగా ఇచ్చిందని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. సుమారు రూ.75 లక్షల విలువైన పరికరాలను ఎన్‌డీడీబీ విరాళంగా ఇచ్చిందని తెలిపారు. తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్స్ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ ఉందని పేర్కొన్నారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే సంస్థలు మొత్తం ఐదు ఉన్నాయని, అందులో ఒక్క ఏఆర్ ఫుడ్స్ సంస్థతోనే ఇబ్బందులని ఈవో శ్యామలరావు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
తిరుమల లడ్డూ వివాదం - రమణ దీక్షితులు కీలక వ్యాఖ్యలు - TIRUMALA LADDU CONTROVERSY