New facility in TSSPDCL Website : గత నెలలో మీరు 105 యూనిట్ల విద్యుత్ వినియోగించారనుకోండి. అధికారులు మాత్రం 34 రోజులకు బిల్లింగ్ తీసి ఎనర్జీ ఛార్జీలు రూ.262.25 వేశారు. అంతక్రితం మీరు ఒక నెలలో 105 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించుకున్నారనుకోండి. విద్యుత్ అధికారులు బిల్లు 30 రోజులకు తీసి ఎనర్జీ ఛార్జీలు రూ.378 వేశారు. ఇక్కడ విద్యత్ మీరు వినియోగించిన యూనిట్ల ఒకటే.. ఎనర్జీ ఛార్జీల్లో మాత్రం భారీగా తేడా కనిపిస్తుంది. బిల్లు తీసిన రోజులు, స్లాబ్‌ను బట్టి ఛార్జీలు మారడమే ఇందు కారణం. ఈ విషయం తెలియక అలా ఎందుకు ఈసారి బిల్లు ఎక్కువ వచ్చిందో అర్థంగాక వినియోగదారులు తలలు పట్టుకుంటారు. దాని గురించి తెలుసుకుందామంటే ఎక్కడ అడగాలో? ఎవరిని అడగాలో? ఎలా తెలుసుకోవాలో తెలియదు.
ఇందుకోసమే టీజీఎస్పీడీసీఎల్ విద్యుత్ వినియోగదారులకు కొత్త సౌలభ్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. మీరు ఎంత విద్యుత్ వినియోగిస్తున్నామో తెలుసుకునే వెసులు బాటు కల్పించింది. టీజీఎస్పీడీసీఎల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి కరెంట్ బిల్లు కాలిక్యులేటర్ వినియోగించిన విద్యుత్ వివరాలను తెలుసుకునే సౌలభ్యం అందుబాటులోకి తెచ్చింది. మరి ఈ క్యాలిక్యులేటర్ వినియోగించి మీ విద్యుత్ బిల్లు వివరాలు ఎలా తెలుసుకోవాలంటే?
- గత నెలలో బిల్లు తీసిన తేదీ.. అప్పుడున్న యూనిట్లు.. ఇప్పుడు బిల్లు తీసిన తేదీ.. ప్రస్తుతం వినియోగించిన యూనిట్ల వివరాలను కాలిక్యులేటర్‌లో నమోదు చేస్తే చాలు. బిల్లు ఎలా లెక్కిస్తారో పూసగుచ్చినట్లు వివరాలు వెల్లడిస్తుంది.
- బిల్లు తీసిన రోజులు.. సగటు యూనిట్ల వినియోగం.. దీన్నిబట్టి ఏ స్లాబ్ వర్తిస్తుంది? మొదటి స్లాబ్‌లోకి ఎన్ని యూనిట్లు, వాటి ఎనర్జీ ఛార్జీలు, రెండో స్లాబ్‌లోకి మారితే అందులోకి వచ్చే యూనిట్లు, వాటి ఛార్జీలను చూపుతుంది.
- పొదుపుగా వాడేందుకు దోహదం: ఎన్ని యూనిట్లు కాలిస్తే ఎంత బిల్లు వస్తుందనే ఎనర్జీ ఛార్జెస్ కాలిక్యులేటర్ ద్వారా సులభంగా తెలుసుకునే వీలుంది కాబట్టి.. ఆ మేరకు విద్యుత్తు ఆదా చేయడం ద్వారా బిల్లింగ్‌ను తగ్గించుకోవచ్చు అని అధికారి ఒకరు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 200 యూనిట్ల విద్యుత్ వినియోగం ఉచితంగా ప్రకటించింది. అన్నట్లుగానే తెల్లరేషన్ కార్డు దారులకు నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వారికి ఎలాంటి బిల్లులు వేయడం లేదు. రెండు వందల యూనిట్లు దాటితే మాత్రం వినియోగించిన మొత్తం విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో వినియోగ దారులు తమ గృహ అవసరాలకు విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవడానికి, విద్యుత్ వినియోగాన్ని కొలిచే కరెంట్ బిల్లు కాలిక్యులేటర్ ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.