Donald Trump Temple in Telangana : డొనాల్డ్ ట్రంప్‌నకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో గుడి ఉందనే విషయం మీకు తెలుసా? జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన బుస్స రాములు, సావిత్రి దంపతుల కుమారుడైన కృష్ణ ఆయనకు చాలా పెద్ద వీరాభిమాని. 2019లో ‘మీరంటే ఇష్టం - మిమ్మల్ని కలవాలని ఉంది’’ అని ట్విటర్‌లో పోస్ట్ పెట్టాడు. దీనికి స్పందించిన ట్రంప్ ‘ఓకే’ అని రీట్వీట్ చేయడంతో కృష్ణ చాలా సంతోషపడ్డాడు.
2020లో ఫిబ్రవరిలో గుడి కట్టి అందులో ట్రంప్ విగ్రహం పెట్టాడు. ఉపవాస దీక్షలు చేశాడు. ట్రంప్ రెండోసారి ఎన్నికల్లో ఓడిపోవడంతో కృష్ణ తీవ్రమైన మనోవేదనకు గురయ్యాడు. 2020 అక్టోబరు 11న గుండెపోటుతో మృతి చెందాడు. కృష్ణ భార్య అంతకు ముందే మృతి చెందారు. ఆయన కుమారుడు అమ్మమ్మ వాళ్ల ఇంట్లో ఉంటున్నాడు. తాజాగా ట్రంప్ రెండోసారి గెలవడంతో కృష్ణ బతికి ఉంటే ఎంతో సంతోషించే వాడని గ్రామస్థులు తెలిపారు. బుధవారం కృష్ణ స్నేహితులు ట్రంప్ విగ్రహం వద్ద పూలమాల వేసి సంబురాలు నిర్వహించారు.
వారికి భరోసా పాలన ఖాయం! : ఇదిలా ఉండగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడంతో ఊరటనిచ్చే ఫలితాలు వచ్చాయని అక్కడ స్థిరపడిన ఓరుగల్లువాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో భారతీయుల ఓటింగ్ సరళి ఎంతో ప్రభావం చూపిందని తెలిపారు. బుధవారం వెల్లడైన ఫలితాల్లో ట్రంప్ విజయం సాధించడంపై అక్కడ ఉంటున్న తెలుగు వారి అభిప్రాయాలు ఈటీవీ భారత్ సేకరించింది. భారతీయ విద్యార్థులకు, అక్కడ ఉద్యోగాలు చేస్తున్నవారికి భరోసా పాలన అందుతుందని చెప్పారు. భారత సంతతి వారికి భవిష్యత్తు మెరుగ్గా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
- ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కనీసం 25 వేల మంది అమెరికాలో నివాసముంటున్నారని అంచనా.
- ఓరుగల్లు వాసులు ఎక్కువగా అట్లాంటా, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, టెక్సాస్, డల్లాస్‌లో ఉంటున్నారు.
కొంతకాలం నుంచి వీసాలు సకాలంలో అందకపోవడంతో ఇబ్బంది పడుతున్న భారతీయులకు ట్రంప్ గెలుపు గొప్ప ఊరటనిస్తుంది. వీసాల విషయంలో ఉదారంగా ఉంటానని ఆయన ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. సరైన ధ్రువపత్రాలతో అమెరికా వచ్చే వారికి నూరు శాతం భరోసా ఇస్తామని ఆయన చెప్పిన మాటలు భారతీయులకు సంతోషం కలిగించింది. - జనగామ జిల్లా దేవరుప్పులకు చెందిన డాక్టర్ పెద్దాపురం ఆదిత్య, సైంటిస్టు అల్బనీ టౌన్, న్యూయార్క్
- హనుమకొండకు చెందిన డా. సుజిత్ పున్నం. 20 ఏళ్ల క్రితం వైద్య విద్య కోసం అమెరికా వెళ్లారు. అక్కడే కార్డియాలజీ నిపుణుడిగా స్థిరపడ్డారు.
భారత్‌పై ట్రంప్ 2.0 ప్రభావమెంత? వీసాలు, బిజినెస్ విషయంలో ఏం జరగనుంది?
అమెరికా అధ్యక్షుడికి ఎంత జీతం ఇస్తారు? ఎలాంటి సౌకర్యాలు, భద్రత కల్పిస్తారో మీకు తెలుసా?