Trident Sugar Factory Workers Suffering over Wages : ఉమ్మడి మెదక్ జిల్లా చెరుకు రైతులకు ఉపయోగపడేందుగానూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజాం షుగర్స్ లిమిటెడ్ పేరుతో జహీరాబాద్‌లో 1972-73 సంవత్సరంలో కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది. బీదర్- హైదరాబాద్ ప్రధాన రహదారికి ఇరువైపులా 132 ఎకరాల విస్తీర్ణంలో రోడ్డుకు ఓవైపు కర్మాగారం, మరోవైపు సిబ్బంది, అధికారుల నివాస గృహాలు నిర్మించింది. కర్మాగారం గానుగ సామర్థ్యం రోజుకు 2,500 టన్నులు ఉండేలా ఏర్పాటు చేశారు.
2003లో ప్రభుత్వం ప్రైవేటు యాజమాన్యానికి కర్మాగారాన్ని విక్రయించింది. ఆ సంస్థ 2006-07లో మరొకరికి అమ్మగా, 2016-17లో ఇంకో చేయి మారింది. తాజాగా మళ్లీ అమ్మక ప్రక్రియ సాగుతున్నట్లు కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిశ్రమలో 164 మంది శాశ్వత ఉద్యోగులుండగా మరో 400 మంది కాంట్రాక్ట్ ప్రాతిపదికన కార్మికులు పని చేస్తున్నారు. జీతాలు లేక, పరిశ్రమ నుంచి రావాల్సిన బకాయిలు రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పరిశ్రమ గానుగ ఆడించకపోవడంతో తమకు పనిలేకుండా పోతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతం ఇవ్వకపోవడంతో బయటకు వెళ్లి పని చేసుకుందామంటే ఎక్కడ తమను పరిశ్రమ నుంచి తొలగిస్తారోనని కార్మికులు రోజూ కర్మాగారానికి వచ్చి సాయంత్రం వరకు ఉండి వెళ్తున్నారు. జీతాలపై ఎన్నిసార్లు పోరాడినా సమావేశాలు పెట్టి కొద్దిరోజుల్లో డబ్బు చెల్లిస్తామంటారే కానీ, నేటికీ పైసా ఇవ్వలేదని చెబుతున్నారు.
పరిశ్రమకు పూర్వవైభవం తీసుకురావాలని : ఏడాది కాలంగా వేతన బకాయిలు చెల్లించడంలేదని మనస్థాపానికి గురైన రమేశ్ బాబు అనే కార్మికుడు, వారం రోజుల కిందట పరిశ్రమ పొగగొట్టం ఎక్కి నిరసన తెలిపి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ నెలలోనే తమ కుమార్తె వివాహం ఉండడంతో ఏర్పాట్లకు కూడా డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అది గమనించిన కార్మికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, అధికారులు పరిశ్రమ వద్దకు చేరుకుని మిగిలిన కార్మికులతో చర్చించారు.
అధికారులతో పాటు స్థానికంగా ఉంటున్న రాష్ట్ర ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గిరిధర్‌రెడ్డి అక్కడికి చేరుకుని ఘటనపై ఆరాతీశారు. ఫోన్ ద్వారా పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్ బాబుకు సమాచారం అందించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి కార్మికులకు రావాల్సిన నగదును ఇప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు. తమ పరిశ్రమకు పూర్వవైభవం తీసుకురావాలని ప్రభుత్వానికి కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలు చెల్లించి, సకాలంలో జీతాలు వచ్చేలా చొరవ చూపాలని విన్నవిస్తున్నారు.
'గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జహీరాబాద్‌లో కార్మికులందరూ బంద్‌కు ప్రకటించారు. దీంతో సీఎం ప్రరిశ్రమకు వస్తున్నారు అనగా ఫ్యాక్టరీ ఓనర్ కార్మికుల జీతాలు రెండ్రోజుల్లో ఇస్తామని లిఖితపూర్వకంగా పేపర్ మీద రాశారు. కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఈలోపు మధ్యవర్తులు వచ్చి సగం భూమిని అమ్ముకున్నారు'-రాములు, చక్కెర పరిశ్రమ కార్మిక సంఘం అధ్యక్షులు