Singareni CMD Balaram Got Tree Man Award : సింగరేణి సంస్థ సీఎండీ బలరామ్‌ను ప్రతిష్టాత్మక ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవార్డు వరించింది. ప్రముఖ గ్రీన్ మ్యాపుల్ ఫౌండేషన్ - 2024 అవార్డుల ప్రదానోత్సవంలో హైదరాబాద్‌లో ఈ అవార్డును బలరామ్‌కు ప్రదానం చేసింది. దేశంలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ దిగ్గజ కంపెనీలు, అందులోని ప్రభావ శీల వ్యక్తులకు గ్రీన్ మ్యాపుల్ సంస్థ ప్రతి ఏడాది ఈ అవార్డులను అందజేస్తుంది. ఈ ఏడాది సంస్థ ఎండీ అశుతోష్ వర్మ, ఎన్టీపీసీ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ఉన్నతాధికారులు సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్‌కు ఈ అవార్డును అందజేశారు.
ప్రతి అడుగు పచ్చదనం అన్న నినాదం : ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, ఎన్.బలరామ్ ఇప్పటికే స్వయంగా 18 వేలకు పైగా మొక్కలు నాటారని, సింగరేణి సంస్థ కూడా ఆరు కోట్లకు పైగా మొక్కలు నాటి పర్యావరణానికి మేలు చేస్తున్న సంస్థల్లో అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు. సివిల్ సర్వీసెస్ అధికారిగా ఉన్నత స్థాయిలో తీరిక లేకుండా ఉన్నప్పటికీ పర్యావరణ పరిరక్షణ కోసం ఒక్కడే 18 వేల మొక్కలు నాటి, 6 జిల్లాల్లో 35 చిన్న అడవులుగా (మినీ ఫారెస్ట్స్) సృష్టించడం దేశంలోనే అత్యంత అరుదని కొనియాడారు.
ప్రతీ అడుగు పచ్చదనం అన్న నినాదంతో సింగరేణిలో మొక్కలు నాటే యజ్ఞాన్ని కొనసాగిస్తున్నామని సీఎండీ బలరామ్ తెలిపారు. సింగరేణి వ్యాప్తంగా ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా మొక్కలు నాటాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. ఈ ఏడాది వన మహోత్సవంలో మరో 2 వేల మొక్కలు నాటాలని వ్యక్తిగత లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. దీంతో 20 వేల మొక్కలు నాటినట్లు అవుతుందన్నారు.
Singareni CMD Balaram On Environment : కంపెనీలో ఈ ఏడాది 40 లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. సింగరేణి సంస్థ చేస్తున్న పర్యావరణహిత చర్యలకు గుర్తింపుగా 2021-22వ సంవత్సరంలో కార్బన్ న్యూట్రాలిటీ కంపెనీగా సీఎం పీడీఐ గుర్తించిందని పేర్కొన్నారు. అలాగే పిల్లల్లో చిన్నతనం నుంచే పర్యావరణ స్ఫూర్తిని పెంచేందుకు వీలుగా సింగరేణి పాఠశాలల్లో పర్యావరణ సిలబస్‌ను బోధిస్తున్నామని, ప్రతి తరగతిలోనూ గ్రీన్ కెప్టెన్లను నియమించి పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందిస్తున్నామన్నారు.
తనకు అవార్డు ప్రకటించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపిన ఆయన, ఈ అవార్డు సింగరేణిలోని పర్యావరణహితులందరికీ చెందుతుందన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని పర్యావరణహిత కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్టీపీసీ, ఆయిల్ ఇండియా తదితర కంపెనీల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.