Dussehra Travel Woes : పండుగ పూట సొంతూళ్లకు వెళదామంటే భయ పడే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ప్రయాణ కష్టాలు అన్నీఇన్నీ కావు. అదనపు బస్సులు ఏర్పాటు చేసినా సమయానికి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి. అదేంటని ప్రయాణికులు ప్రశ్నిస్తే తిరిగి వారిపైనే మాటల దాడి జరుగుతుంది. ప్రయాణికులు సాధారణంగా టికెట్ కోసం వారు ఎక్కిన స్టాప్ నుంచే టికెట్ కొట్టాలి. కానీ బస్సు ఎక్కడి నుంచి బయలుదేరుతుందో అక్కడి నుంచి ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇది సగటు ప్రయాణికుడికి మరింత ఆర్థిక భారంగా మారుతోంది.
దీనికి తోడు మార్గమధ్యలో కొన్ని బస్సులు బ్రేక్‌డౌన్ కావడంతో ప్రయాణికులకు పండుగ అంటేనే అసహనం కలిగే చేస్తున్నారు. వేర్వేరు జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు మియాపూర్, ఎల్బీనగర్, కూకట్పల్లి, ఉప్పల్, ఆరాంఘర్, గచ్చిబౌలి, శంషాబాద్ తదితర ప్రాంతాల నుంచి బస్సులు ఎక్కుతుంటారు. వారికి టికెట్ ఎంజీబీఎస్, జేబీఎస్ నుంచి ఛార్జీలు వస్తూలు చేస్తుండటంతో పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
టికెట్‌పై ఎక్కువ వసూలు చేస్తున్న కొన్ని ఉదంతాలు :
- జనగామ, యాదాద్రి, వరంగల్ వెళ్లేవారంతా ఉప్పల్ పాయింట్ నుంచే బస్సు ఎక్కుతుంటారు. కానీ ప్రత్యేక బస్సుల్లో మాత్రం ఉప్పల్ స్టాప్ నుంచి కాకుండా జేబీఎస్ స్టాప్ నుంచి టికెట్ తీసుకుంటున్నారు. ఇదేంటని కండక్టర్‌ను ప్రశ్నిస్తే తమకు ఇచ్చిన టిమ్ మెషీన్లో అలాగే ఉందంటూ దబాయిస్తున్నారు.
- సంగారెడ్డి వెళ్లేందుకు మియాపూర్‌లో బస్సు ఎక్కితే ఎంజీబీఎస్ స్టాప్ నుంచి టికెట్ తీసుకోవడంతో ప్రయాణికులు కండక్టర్ మధ్య వాగ్వాదం జరిగింది. మధ్యలో కూకట్పల్లి స్టేజీ ఉన్నా ఎంజీబీఎస్ నుంచి టికెట్ ఎలా ఇస్తారంటూ ప్రయాణికులు ఆగ్రహించారు. దీనిపై మియాపూర్ డిపో కంట్రోలర్‌ను అడిగితే కంప్యూటర్లో కూకట్పల్లి స్టేజీ ఫీడ్ చేయకపోవడంతో ఈ సమస్య వచ్చిందని చెప్పారు.
- ఇంకొన్ని చోట్ల ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్‌డెస్క్ నంబర్లు ఇచ్చినా స్పందించే అధికారులు కరవు అయ్యారు. దిల్సుఖ్నగర్, ఎంజీబీఎస్ విచారణ కేంద్రాల నంబర్లకు గంటల తరబడి ఫోన్ చేసినా ఎవరూ తీయడం లేదంటూ ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు.
- ఖమ్మం, కరీంనగర్ మార్గాల్లో సూపర్ లగ్జరీ బస్సులు మార్గ మధ్యంలో బ్రేక్‌డౌన్ అవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు.
ప్రైవేటు దోపిడీ మామూలుగా లేదు : దసరా పండుగ ప్రైవేట్ ట్రాన్స్‌ఫోర్ట్ వాళ్లకు పండగనే తీసుకువచ్చింది. ఎల్బీనగర్, గచ్చిబౌలి మీదుగా విజయవాడ, కాకినాడ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల నుంచి రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. సాధారణంగా విజయవాడకు ప్రయాణ ఛార్జీ రూ.450 వరకు ఉంటుంది. కానీ రూ.600-700 వరకు ఛార్జీలు వేస్తున్నారు. అలాగే కాకినాడకు రూ.800 ఉంటే రూ.1,200 వరకు వసూలు చేస్తున్నారు. శుక్రవారం ఛార్జీలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రయాణికులు వాపోతున్నారు.