Minister Ponnam Prabhakar Review On TGSRTC : మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు తీసుకురాబోతున్నామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోన్న మహాలక్ష్మి పథకాన్ని నేటి వరకు 68.60 కోట్ల మంది మహిళలు వినియోగించుకుని, రూ.2350 కోట్లను ఆదా చేసుకున్నారని ఆయన తెలిపారు.
సంస్థలోని ప్రతి ఒక్క సిబ్బంది నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో చేస్తుండటం వల్లే మహాలక్ష్మి పథకం విజయవంతంగా అమలవుతోందని ప్రశంసించారు. హైదరాబాద్ బస్ భవన్లో ఇవాళ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పనితీరుపై రవాణాశాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సంస్థలోని అన్ని విభాగాల పనితీరు, మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం అమలు, కొత్త బస్సుల కొనుగోలు, ఆర్థికపరమైన అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఉన్నతాధికారులు మంత్రికి వివరించారు.
Retired Employees to Expand Cargo Services : అనంతరం క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తోన్న కండక్టర్లు, డ్రైవర్లతో వర్చ్‌వల్‌గా సమావేశమయ్యారు. మహబుబాబాద్, హయత్ నగర్ -2, నిజామాబాద్-2, అసిఫాబాద్, హుస్నాబాద్, నారాయణపేట, మిర్యాలగూడ, మధిర, సిద్ధిపేట, సంగారెడ్డి డిపోలకు చెందిన సిబ్బందితో స్వయంగా ముచ్చటించారు. మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులకు సహకారం అందించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని పేర్కొన్నారు.
మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు ఇప్పుడున్న సర్వీసుల కంటే మెరుగైన రవాణా సౌకర్యాలకు ప్రయాణికులకు కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ ఆర్థిక ఏడాదిలో ఇప్పటివరకు 38 డిపోలు లాభాల్లో ఉన్నాయని, మిగతా డిపోలు కూడా వృద్ధి సాధించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. కార్గో సేవలను విస్తరించేందుకు రిటైర్డ్ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలన్నారు.
ఆర్టీసీ ఉచిత ప్రయాణంతో రూ.2,350 కోట్లు ఆదా చేసుకున్నారు : మహాలక్ష్మి పథకం కింద ఇప్పటివరకు రూ.2,350 కోట్లను మహిళలు ఆదా చేసుకున్నారని, జీవో ప్రకారం రీయంబర్స్ కింద ఇప్పటివరకు రూ.1,740 కోట్ల నిధులను ప్రభుత్వం సంస్థకు విడుదల చేసిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రతి రోజు సగటున 30 లక్షల మంది మహిళలను సంస్థ క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతోందని వివరించారు.
సిబ్బంది కష్టపడి చేయడం వల్ల త్వరలోనే సంస్థ బిలియన్ డాలర్ (రూ.8500 కోట్లు) టర్నోవర్ కార్పొరేషన్‌గా అవతరించబోతుందని తెలిపారు. టీజీఎస్ ఆర్టీసీ దేశానికి రోల్ మోడల్‌గా సంస్థ నిలిచిందని వివరించారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ మెడికల్ ఫెసిలిటీ స్కీం (ఆర్.ఈ.ఎం.ఎఫ్.ఎస్)కింద లభించే ప్రయోజనాలను స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు సంస్థ వర్తింపజేసింది.
గతంలో ఉన్న నిబంధనల్లో మార్పు చేస్తూ కొత్త సర్కులర్‌ను సంస్థ జారీ చేసింది. ఈ మేరకు మార్పులు చేసిన సర్కులర్‌ను ఈ సమీక్ష సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు. మెడికల్ రిటైర్డ్ అయిన సిబ్బందితో పాటు కారుణ్య ఉపాధి పొందని బాధిత జీవిత భాగస్వాములూ ఈ స్కీం సభ్యత్వాన్ని పొంది ప్రయోజనాలను పొందనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సీలింగ్ ప్రకారం సభ్యత్వం పొందిన లబ్ధిదారులు జీవిత కాలం వరకు వైద్య ఖర్చులకు రూ.4 లక్షల వరకు వినియోగించుకునే సదుపాయాన్ని సంస్థ కల్పించింది.
హైదరాబాద్ బస్ భవన్ లో శనివారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) పనితీరుపై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సంస్థలోని అన్ని విభాగాల పనితీరు, మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం అమలు, కొత్త… pic.twitter.com/JLEh2siMhW
— Ponnam Prabhakar (@Ponnam_INC) July 20, 2024
ముందు నుంచి ఎక్స్‌ప్రెస్ - వెనక నుంచి పల్లె వెలుగు - కంగుతినేలా ఆర్టీసీ బస్సు రంగు