AICC Focus on Telangana PCC New Members : రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మూడో పీసీసీ అధ్యక్షుడుగా మహేశ్ కుమార్ గౌడ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డికి పార్టీకి చెందిన కార్యకలాపాల నుంచి విముక్తి లభించింది. ఇప్పుడు పాలనాపరమైన అంశాలపై రేవంత్ రెడ్డి, పార్టీపరమైన విషయాలపై మహేశ్ కుమార్ గౌడ్ పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకు అవకాశం ఏర్పడింది. పీసీసీ అధ్యక్షుడుగా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన మహేశ్ కుమార్ గౌడ్ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు.
కార్యవర్గం కూర్పుపై కసరత్తు : ఇప్పటికే పార్టీ కోసం పని చేసిన నాయకుల వివరాలను పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ గాంధీభవన్ నుంచి తీసుకున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, అంతకు ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి కార్యవర్గాలకు చెందిన పేర్లు హోదాలతో కూడిన జాబితాను తెప్పించుకున్నారు. వారిలో గడిచిన పదేండ్ల కాలంలో పార్టీ కోసం పని చేసిన వారి జాబితా కూడా ప్రత్యేకంగా సిద్ధం చేశారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పీసీసీ కార్యవర్గంలోకి ఉపయోగపడే స్థాయి కలిగిన, పార్టీ కోసం చురుగ్గా పని చేసి ప్రభుత్వంలో ఎలాంటి పదవులు పొందకుండా ఉన్న నాయకులు 150 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. కార్యవర్గం లేకుండా పార్టీ కార్యకలాపాలు కొనసాగడం సాధ్యం కాదు. దీంతో వీలైనంత త్వరగా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఇప్పటికే సిద్ధంగా ఉన్న పార్టీ కోసం పని చేసిన వారి జాబితాను ఇవాళ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శులతో మహేష్ కుమార్ గౌడ్లు పరిశీలిస్తారు. అందులో పార్టీ కోసం చురుగ్గా పని చేయగలిగిన నాయకులను ఎంచుకుంటారు.
కార్యనిర్వాహక అధ్యక్షులు : అందులో కార్యనిర్వాహణ అధ్యక్షులు నలుగురు కానీ, అయిదుగురు కానీ నియమించాల్సి ఉంటుంది. వారిలో కూడ మహిళ, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గాల నుంచి నియమించాల్సి ఉంది. కార్యనిర్వాహక అధ్యక్షులు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా నియమితులు కావచ్చు. అదేవిధంగా మరో పది మంది వరకు ఉపాధ్యక్షులను నియమించే అవకాశం ఉంది. ఇక ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు సంఖ్యాపరంగా గతంలో మాదిరి కాకుండా ఆ సంఖ్యను కుదించాలని మహేష్ భావిస్తున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మహేశ్‌కుమార్ గౌడ్ - TPCC NEW CHIEF TAKES CHARGE TODAY