Nagarjuna Sagar To Srisailam Boat Tour Started : సెలవుల వేళ ఎక్కడికి వెళ్లాలని ఆలోచిస్తున్నారా? రోటిన్‌గా ట్రైన్, బస్సు, కారులో కంటే విభిన్న రకాల బోట్లతో ప్రకృతి ఒడిలో గడిపేందుకు ఈ పర్యాటక ప్రాంతాలు ఆహ్వానిస్తున్నాయి. పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు ఎదురు చూస్తున్న నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు బోటు ప్రయాణాన్ని కార్తీక మాసం తొలిరోజు రాష్ట్ర పర్యాటక శాఖ ప్రారంభించింది. గత ఐదేళ్లుగా ప్రణాళిక చేసిన్నప్పటికీ నాగార్జునసాగర్ డ్యామ్‌లో సరైన మట్టంలో నీరు లేకపోవడం, కరోనా మహమ్మారి తదితర కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుత వర్షాకాల సీజన్లో విస్తారంగా వర్షాలు పడటంతో కృష్ణానదిలో శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ వరకు గరిష్ఠ మట్టంలో నీటి లభ్యత ఉంది.
దీంతో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణాన్ని ప్రారంభించింది. దాదాపు 120 కిలోమీటర్ల దూరం ఉండే లాంచీ ప్రయాణానికి మొదటి రోజు రాష్ట్రంతో పాటు పరిసర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చారు. పర్యాటకులు నాగార్జున సాగర్ నుంచి నందికొండ మీదుగా ఏలేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అటవీ ప్రాంత అందాలను చూసేలా లాంచీ ప్రయాణానికి పర్యాటక శాఖ శ్రీకారం చుట్టింది. మరొక మార్గంలో నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ సేవలను కూడా పర్యాటకాభివృద్ధి సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది.
కొల్లాపూర్ మండలం సోమశిల తీరంలో 120 మంది ప్రయాణించేలా ఏసీ లాంచీని అధికారులు ఇవాళ ప్రారంభించారు. అక్కణ్నుంచి శ్రీశైలం వరకు 120 కిలోమీటర్ల మేర 7 గంటల పాటు లాంచీ ప్రయాణం ఉంటుంది. లాంచీ ప్రయాణానికి పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ.1,600 టికెట్ ధర నిర్ణయించారు. నాగార్జునసాగర్ డ్యామ్‌లో నీటి మట్టం 575 అడుగులు ఉన్నంత వరకు, ప్రయాణికుల రద్దీ ఆధారంగా శ్రీశైలానికి లాంచీలు నడిపించనున్నట్లు పర్యాటకాభివృద్ధి సంస్థ తెలిపింది.
'పర్యాటకుల డిమాండ్ మేరకు నాగార్జున సాగర్ టూ శ్రీశైలం లాంచీ ప్రయాణాన్ని ప్రారంభించాం. శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయాన్ని దర్శించుకుని రెండో రోజే మళ్లీ సాగర్‌కు తిరుగు ప్రయాణం అయ్యేలా ఏర్పాటు చేశాం'- పర్యాటక శాఖ అధికారి
ఆకట్టుకుంటున్న లక్నవరంలోని బోటింగ్ అందాలు : మరోవైపు అంతకుముందు ఉన్న దానికంటే రెట్టింపుగా పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేలా వరంగల్‌లోని లక్నవరం అందాలు ఆకట్టుకుంటున్నాయి. ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలంలోని లక్నవరం జలాశయానికి వాటర్రోలర్, పల్లకీ బోట్, పెడల్ బోట్‌తో మరింత ఆకర్షణ తోడైంది. పర్యాటకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నేపథ్యంలో శుక్రవారం దీపావళి సందర్భంగా నిర్వాహకులు రకరకాల బోట్లను అందుబాటులోకి తెచ్చారు.
ఒక వాటర్ రోలర్‌తోపాటు మూడు రకాల బోట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. నీటిలో వాటర్ రోలర్‌తో తిరుగుతూ ఆనందంతోపాటు ఓ వింత అనుభూతిని పొందొచ్చు. పైగా అందులోనే సేదరీరొచ్చు కూడా. దీని భిన్నంగా ప్రత్యేకత కోరుకునే వారు నీటిలో పల్లకీ బోటులో ఎంచక్కా షికారుకెళ్లొచ్చు. పల్లకీని తలపించేలా బోటును తీర్చిదిద్దారు. కాళ్లతో తొక్కితే కదిలే పెడల్‌బోటుపాటు పాతకాలంలో ఉండే తెడ్ల సాయంతో ముందుకెళ్లేలా కయాకింగ్ బోట్లు సైతం లక్నవరం ప్రకృతి ఒడిలో గడిపేందుకు రారమ్మని ఆహ్వానిస్తున్నాయి.
పాపికొండలు వెళ్లొద్దామా! - గోదారి అందాలు చూసొద్దామా
అలా "సోమశిల" చూసొద్దామా - తక్కువ ధరకే తెలంగాణ టూరిజం సూపర్ ప్యాకేజీ - పైగా శ్రీశైలం చూడొచ్చు!