Toilets Problems in Government Schools in Gadwal : జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని చింతల్‌పేట బాలుర ఉన్నత పాఠశాలలో సుమారు బాలురు, బాలికలు కలిసి 1,350 మంది విద్యార్థులు చదువుతున్నారు. సగానికి పైగా బాలురు ఉంటారు. కాగా ఈ పాఠశాల గత ఏడాది మన బస్తీ - మన బడి కార్యక్రమం కింద ఎంపికైంది. అందులో భాగంగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. అందుకోసం సుమారు 16 నుంచి 18 పాత టాయిలెట్స్‌ను కూల్చివేశారు. కొత్తవి నిర్మాణం ప్రారంభించినా, వాటిని మధ్యలోనే నిలిపివేశారు. బాలికలు, స్టాఫ్ కోసం ముందు జాగ్రత్తగా కొన్ని టాయిలెట్స్‌ను కూల్చకుండా వదిలేశారు.
అవే ఇప్పుడు వారికి దిక్కయ్యాయి. ఉన్న మూడు నాలుగు టాయిలెట్స్ బాలికలు వాడుకుంటుండగా ఒకటి స్టాఫ్ వాడుకుంటున్నారు. వాటిని కూడా శుభ్రపరిచే దిక్కు లేదు. బడిని శుభ్రపరిచే బాధ్యత మున్సిపల్, పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులకు అప్పగించినా, వారు పట్టించుకోవడం లేదు. దీంతో దుర్వాసనల నడుమే వాటిని వినియోగించాల్సి వస్తుందని బాలికలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలుర పరిస్థితి చెప్పనక్కర లేదు. ఏదొచ్చినా బైటకు వెళ్లాల్సిందే.
Students Request to Himanshu : 'ఓ హిమాన్షు అన్న.. మా స్కూల్‌నూ దత్తత తీసుకోండి'
భీంనగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరిస్థితీ దాదాపు అదే. అక్కడ సుమారు 1100 విద్యార్థినీ, విద్యార్ధులు చదువుతున్నారు. వీరిలో 500 మందికి పైగా బాలికలు ఉంటారు. మన ఊరు - మన బడి కింద అక్కడ మరమ్మతులు, కిచెన్ షెడ్ నిర్మాణం సహా అన్ని పనులు పూర్తయ్యాయి. కానీ మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణం మాత్రం మధ్యలోనే ఆగిపోయింది. 20కి పైగా టాయిలెట్స్ ఉండాల్సిన చోట బాలికలు, స్టాఫ్ కోసం మాత్రమే నాలుగు టాయిలెట్స్ ఉన్నాయి. బాలురంతా ఆరు బయటకు వెళ్లాల్సి వస్తోంది. 500ల మంది బాలికలకు, ఉన్న 4 టాయిలెట్లు సరిపోవడం లేదు. దుర్వాసన వస్తోందని, వాటిని వినియోగించులేక పోతున్నామని బాలికలు వాపోతున్నారు.
Toilets Problems in Government Schools : బూర్జపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరిస్థితి మరీ దారుణం. అక్కడ మన బస్తీ- మన బడి కింద మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మిస్తామని చెప్పి ఉన్న వాటిని మొత్తం తొలగించారు. ఒక్కటి మాత్రమే మిగిల్చారు. ఆ ఒక్క టాయిలెట్‌నే బాలికలు, స్టాఫ్ వినియోగించుకుంటున్నారు. కాలకృత్యాలు తీర్చుకోవాలంటే సుమారు కిలోమీటరు దూరం నడిచి వెళ్లాలి. చదువు సంగతి దేవుడెరుగు. అదే ఓ పెద్ద సమస్యగా తయారైందంటున్నారు విద్యార్ధులు.
ఈ మూడు పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణం ఆగిపోవడానికి ప్రధాన కారణం మన బస్తీ-మన బడి కింద చేసిన పనులకు గుత్తేదారులకు బిల్లులు రాకపోవడమే. బిల్లులు వస్తేనే వాటిని పూర్తి చేస్తామని మెలిక పెట్టిన గుత్తేదారులు, 4 నెలలుగా పనుల్ని ఆపేశారు. అప్పటి నుంచి విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. పైగా ఉన్నత పాఠశాలలు కావడంతో ఈ స్కూళ్లలో పదో తరగతి పరీక్షాల కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. టాయిలెట్స్ లేకుండా పరీక్షలు ఎలా నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.
పట్టణంలోనే కాదు గ్రామాల్లో పాఠశాలల పరిస్థితి కూడా అలాగే ఉంది. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు జడ్పీ ఉన్నత పాఠశాలలో 300 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 160 మంది బాలికలు. వారికి ఉన్నది కేవలం 3 టాయిలెట్లు మాత్రమే. అవీ ప్రస్తుతం నిర్వహణ లేక మూతబడ్డాయి. ఈ క్రమంలో బాలికలు కాలకృత్యాలను ఆరుబయటే కానిస్తున్నారు. బాలికలను ఈ సమస్య తీవ్రంగా వేధిస్తున్నా, అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి విద్యార్థులు లేఖ రాశారు.