Tips To Stop Phone Addiction To Children : ఓ తల్లి తన కుమారుడు అన్నం తినడానికి, అల్లరి చేయకుండా కుదురుగా కూర్చోవడానికి తరచూ సెల్‌ఫోన్ ఇచ్చేది. ఒకటో తరగతికి వచ్చిన ఆ పిల్లాడు ఇప్పుడు ఫోన్ ఇవ్వకపోతే అందరినీ కొడుతున్నాడు. గట్టిగా ఏడుస్తూ మారాం చేస్తున్నాడు. చేసేది లేక ఆ పిల్లాడిని తల్లిదండ్రులు వైద్యుని వద్దకు తీసుకెళ్లి చికిత్స అందించారు.
ఏడో తరగతి బాలుడు ఇంట్లో నిద్రించాక రాత్రుళ్లు ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడు, తండ్రికి ఫోన్ తీసుకుని గంటల తరబడి ఫోన్ చూసేవాడు. మరుసటి రోజు ఆలస్యంగా నిద్రలేచేవాడు. దీనివల్ల అతనికి కంటి సమస్యతో పాటు చికాకు, నీరసం వంటి సమస్యలు వచ్చి చదువులో వెనుకబడ్డాడు.
స్మార్ట్ ఫోన్‌తో అన్ని కనుమరుగు : పాలు తాగే పిల్లాడు ఏడిస్తే తల్లి దగ్గరకు తీసుకుని కడుపు నింపేది. భయంతో ఏడిస్తే నేనున్నాని భరోసా ఇస్తూ దగ్గరకు తీసుకుని లాలించేవారు. చందమామను చూపిస్తూ, అమమ్మ తాతలతో కథలు చెప్పిస్తూ గోరుముద్దలు తినిపించేవారు. పాటలు పాడుతూ నిద్ర పుచ్చేవారు. ఇవన్నీ ఒకప్పటి కాలంలో చేసేవారు కానీ ఇప్పుడు అవన్నీ స్మార్ట్‌ఫోన్ పుణ్యమాని మాయమైపోయాయి.
ఆప్యాయతలు, ప్రేమానురాగాలు కనుమరుగవుతున్నాయి. పిల్లాడు మారాం చేస్తే చాలు సెల్‌ఫోన్ చేతికి ఇస్తున్నారు. అంతే ఏడుపు ఒక్కసారిగా ఆగిపోతుంది. పిల్లలు గంటల తరబడి స్క్రీన్ టైమ్ గడుపుతూ వాటికి బానిసలై 'స్మార్ట్ జాంబీ'లుగా మారుతున్నారని మానసిన వైద్య నిపుణురాలు హేమలత అంటున్నారు. ఆటలు ఆడుతూ హాయిగా గడపాల్సిన బాల్యం సెల్‌ఫోన్‌లలో బందీ అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పిల్లల ఎదుగుదలపై ప్రభావం : తల్లిదండ్రులు మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్తున్న పిల్లలో చాలావరకు సెల్‌ఫోన్ బాధితులు ఉండడం ఆందోళనం కలిగించే విషయం. పిల్లలు రోజూ 3-4 గంటలు సెల్‌ఫోన్ చూడటం వల్ల మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుందని, 5ఏళ్ల లోపు చిన్నారులు రోజుకు ఒక గంట కంటే ఎక్కువ ఫోన్ చూడకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. స్మార్ట్ స్క్రీన్ నుంచి విడుదలయ్యే బ్లూ లైట్ వారి కళ్లపై ప్రభావం చూపుతోందని, రేడియేషన్ ప్రభావంతో నెగిటివ్ ప్రభావం పడుతోందని వైద్యులు అంటున్నారు.
- 5సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల్లో 99శాతం మంది సెల్‌ఫోన్లు, గాడ్జెట్‌లకు అలవాటు పడుతున్నారు.
- దేశంలో 66% మంది తల్లిదండ్రులకు తమ పిల్లలు అధిక స్క్రీన్ సమయం వెచ్చిస్తుండటం ప్రమాదమని తెలియదు.
- ఓ అధ్యయనం ప్రకారం 65శాతం కుటుంబాలు పిల్లలు అన్ని తినడానికి ఫోన్లు, టీవీలు చూపిస్తున్నారు.
- సంవత్సరం వయసున్న పిల్లలు రోజులు 53 నిమిషాలు స్మార్ట్‌ఫోన్ చూస్తున్నారు. 3 సంవత్సరాల పిల్లలు గంటన్నరకు పైగా స్క్రీన్ చూస్తున్నారు.
- సెల్‌ఫోన్ అతిగా వాడే పిల్లల్లో మెదడు, వినికిడి, మాట్లాడే సామర్థ్యంపై ప్రభావం పడుతుందని వెల్లడైంది. దీంతో వారు ఏకాగ్రతను, నేర్చుకునే సామర్థ్యాన్ని కోల్పోతున్నారు.
- పిల్లలకు వీలైనంత వరకు డిజిటల్ తెరలకు దూరంగా ఉంచడమే మంచింది.
- శారీరక శ్రమ కలిగించేలా ఆటలు ఆడించడం, నైపుణ్యాలను పెంచే విధంగా తల్లిదండ్రులు వారికి సూచనలు ఇవ్వాలి. మెల్లగా ప్రయత్నిస్తే ఇది వర్కౌట్ అవుతుంది.
- పిల్లలున్న సమయంలో తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్ వాడకపోవడం మానుకోవడం మంచిది. లేదంటే పెద్దలు చూసే సోషల్ మీడియా, వీడియోలు, రీల్స్‌కు పిల్లలు త్వరగా అలవాటు పడతారు. ముఖ్యంగా గేమ్స్‌కు అలవాటు పడకుంటా చూడాలి.
- బడి నుంచి ఇంటికి రాగానే దగ్గరుండి వారితో హోమ్‌వర్క్ చేయించాలి. స్మార్ట్‌ఫోన్ వల్ల కలిగే అనర్థాల గురించి వారికి అర్థమయ్యేలా పిల్లలకు చెబుతుండాలి.
అలాంటి కేసులే ఎక్కువ : స్మార్ట్‌ఫోన్‌తో ఎక్కువ సమయం గడిపే వారు ఎవ్వరితో మాట్లాడరని, ఆడుకోరని, తల్లిదండ్రులతో అరవడం, వాగ్వాదం చేస్తుంటారని మానసిన వైద్య నిపుణురాలు హేమలత తెలిపారు. మానసికంగా కుంగిపోతారని చెప్పారు. సెల్‌లో గేమ్స్ ఎక్కువగా ఆడటం వల్ల డిప్రెషన్‌లోకి వెళ్తారన్న ఆమె ఈ మధ్య ఇలాంటి కేసులు ఎక్కువగా వస్తున్నాయని వివరించారు. తల్లిదండ్రులు ఆటలు ఆడించడం, వారితో కలసి ఆడటం, తోటి పిల్లలతో కలిసేలా చేయడం తదితరాలు చేయాలని సూచించారు.
Rape on Minor Girl in Hyderabad : సెల్‌ఫోన్ ఆశ చూపి.. మైనర్ బాలికపై తండ్రీకుమారుల అత్యాచారం