Festive Healthy Eating : తెలుగువారి ఇళ్లలో పండుగల అంటేనే చాలు పిండివంటలు సహా పలు వంటకాలకు పెట్టింది పేరు. వేడుక ఏదైనా కానీ పంచభక్ష పరమాన్నాలే అని ఏమీలేదు ఎవరికి తోచినంత స్థాయిలో వివిధ రకాలు వంటలను చేస్తారు. అటువంటి పండగల సమయంలో ముఖ్యంగా పిండి వంటల్ని ఆస్వాదించే విషయంలో కొంతమంది అస్సలు తగ్గేదేలేదంటారు. ఈక్రమంలో తమకు నచ్చిన స్వీట్స్, డీప్ ఫ్రై చేసిన వంటకాల్ని మనసారా లాగిస్తుంటారు. ఇవి తినేటప్పుడు బాగానే ఉంటాయి కానీ.. ఆ తర్వాతనే తంటాలు మొదలవుతాయి. ముఖ్యంగా అజీర్తి, కడుపుబ్బరం.. వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందుకే ఈ సమయంలో నచ్చినవి మితంగా తీసుకుంటూనే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో- పండగ వేడుకల వేళ ఇలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ స్టోరీలో చూద్దాం రండి..
✵ సాధారణంగా భోజనం ముందు వాటర్ తాగకూడదంటారు. కానీ ప్రత్యేక సందర్భాల్లో ఎక్కువ తినేస్తామేమో అనే భయం ఉంటే ఏదైనా తినే ముందు కొన్ని నీళ్లు తాగడం వల్ల అతిగా తినకుండా జాగ్రత్తపడచ్చు.. శరీరాన్నీ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవచ్చని తెలుపుతున్నారు నిపుణులు. అలాగే రోజంతా మధ్యమధ్యలో వాటర్ తాగుతూ ఉండడం మాత్రం మర్చిపోవద్దు. ఈ క్రమంలో కాఫీ, కూల్ డ్రింక్స్, కాక్‌టెయిల్స్.. వంటి వాటికి దూరంగా ఉండాలి.
✵ దసరా, దీపావళి పండగ సందర్భంగా - స్పెషల్స్ లేకపోతే ఎలా అని అవీ ఇవీ బయటి నుంచి తెచ్చుకోవడం కాకుండా ఇంట్లోనే తయారుచేసుకోవాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం.
✵ అన్నిటికన్నా ప్రధానమైనది - వంటకాలు ఎంత బాగున్నా సరే మితంగానే తినాలి.
✵ పండగ రోజు తీసుకున్న ఆహారం వల్ల మన శరీరంలో చేరిన విషతుల్యాలను తరువాతి రోజు తొలగించుకోవాల్సి ఉంటుంది. ఈక్రమంలో ఈజీగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. అలాకాకుండా పండగ రోజు కొన్ని ఐటెమ్స్ మిగిలిపోయాయి కదా అవి తీసుకుందాం అనుకుంటే.. అజీర్తి, కడుపుబ్బరం.. వంటి అనారోగ్య సమస్యలు తప్పవు! ఒకవేళ ఈ సమస్యలు బాధిస్తుంటే గుల్‌కండ్ తీసుకోవటం మంచిది.
✵ అలాగే పండగైనా సరే - రోజూ చేసే శారీరక/మానసిక వ్యాయామాలు చేయడం మాత్రం మర్చిపోవద్దు.
దసరా రోజున జంక్‌ఫుడ్‌కు స్వస్తి చెప్పండి - ఈ అహార అలవాట్లతో మంచి ఆరోగ్యాన్ని పొందండి