Tips For Cast Your Vote : ఓటు ఉన్నా చాలా మంది అంతగా ఆసక్తి చూపించకుండా ఇంటికే పరిమితం అవుతుంటారు. కొంతమందైతే వరుస సెలవులు రావడంతో కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళుతుంటారు. ఎంతో విలువైన ఓటుహక్కును వినియోగించుకోవడంలో అశ్రద్ధ చూపిస్తుంటారు. అధిక ఎండలకు తోడు గంటల తరబడి క్యూలో ఉండాలనే భావన, పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి లేకపోవడం. మన ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుందిలే అనే ధీమాతో చాలామంది ఓటుకు దూరంగా ఉండిపోతుంటారు. అయితే అది అపోహ మాత్రమే . ఎంతో విలువైన ఓటుహక్కును ఉపయోగించుకోవడం అనేది ఒక బాధ్యతగా భావించాలని నిపుణులు సూచిస్తున్నారు.
మీరు గుర్తుంచుకోవాల్సిన అంశాలివే
- ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమై సాయంత్రం 6 వరకు కొనసాగుతుంది. ఉదయం 7-9 మధ్య అంతగా భారీ క్యూలుండవు. ధ్రువపత్రాలు సరిగ్గా ఉన్నట్లయితే, 10-15 నిమిషాల్లో ఓటు వేసి బయటకు వచ్చేయొచ్చు.
- గతంలో సాయంత్రం 5 వరకే పోలింగ్ ప్రక్రియ కొనసాగేది. ఎండలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల కమిషన్ దానిని సాయంత్రం 6 వరకు పెంచింది. సాయంత్రం 6 గంటలలోపు లైనులో ఉంటే, అందరూ ఓటేసే వరకు అవకాశం ఇస్తారు.
- పోలింగ్ కేంద్రం లోపలికి సెల్‌ఫోన్‌ను అనుమతించరు. పోలింగ్ సిబ్బంది కళ్లు కప్పి తీసుకెళ్లి అక్కడ సెల్ఫీలు దిగడం నేరం. దీనిపై కేసు పెట్టే అవకాశముంది. జాగ్రత్త.
- ఓటు వేసేటప్పుడు స్లిప్ కనిపించేంత వరకు (7 సెకన్లు) బటన్‌ను నొక్కి ఉంచండి. ఒక బీప్ శబ్ధం ధ్వనిస్తుంది. వీవీ ప్యాట్ స్లిప్‌తో మీ ఓటును ఎవరికి వేశారో నిర్ధారించుకోండి.
- ఏదైనా పనిలో పడితే ఓటు వేయడం మర్చిపోయే ప్రమాదం ఉంది. కనుక ముందు ఓటేశాకనే మిగతా పనులు పెట్టుకోవాలి. కుటుంబ సభ్యులంతా ఒకేసారి వెళ్తే అందరూ ఒకేసారి ఓటు వేసి రావచ్చు. సెల్‌ఫోన్ లోపలికి అనుమతించరు కనుక, మీ వారికి మొబైల్ ఇచ్చి పోలింగ్ బూత్‌లోకి వెళ్లవచ్చు.
- ఉదయం 11 తర్వాత వెళ్లే పెద్దలు ఎండ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
- చాలా మంది ఉదయం 5, 6 గంటలకే ఉదయపు నడకకు వెళుతుంటారు. పనిలో పనిగా ఓటర్ ఐడీ తీసుకెళ్తే అటు నుంచి అటే వెళ్లి ఓటు వేసి రావచ్చు.
- పోలింగ్ కేంద్రం దూరంగా ఉన్నవారికి రాపిడో ఉచిత రైడ్ సౌకర్యం కల్పిస్తుంది. ఈ సౌకర్యం ద్వారా బుక్ చేసుకుంటే తీసుకెళ్లి మళ్లీ ఇంటి వద్ద దించుతాయి. దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక వాహనాలున్నాయి.
- ముందుగానే ఓటరు ఐడీ కార్డు, పోలింగ్ కేంద్రం చిరునామాను తెలుసుకోవాలి.
- కొన్నిసార్లు ఓటరు జాబితాలో పేరుండకపోవచ్చు. తీరా పోలింగ్ కేంద్రం వద్దకు వెళ్లి ఓటు లేక ఉసూరుమంటూ తిరిగి రాకుండా ముందే జాబితాలో మీ పేరుందో లేదో చెక్ చేసుకోవాలి.
- ఏపీ, తెలంగాణ ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌ను సందర్శించి ఈ వివరాలను సులువుగా తెలుసుకునే వీలుంది.
మీ ఓటర్ స్లిప్‌ను ఆన్లైన్లో ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి - How to Download Voter Slip Online