Tiger Entered in Warangal Forest Areas : చుట్టూరా పచ్చదనం, ఎత్తైన గుట్టలు, ఎన్నో వృక్షజాతులు, మరెన్నో వన్యప్రాణులు మరోవైపు గోదావరి పరవళ్లు ప్రకృతి రమణీయతతో ఉమ్మడి వరంగల్ అభయారణ్యం అందరినీ ఆకట్టుకుంటుంది. ఏటూరునాగారం, పాకాల అరణ్యం ఒకప్పుడు పెద్ద పులులకు ఆవాసం. ఇప్పుడు మరోసారి దాని అలికిడి కనిపించింది. ఓరుగల్లు అటవీ ప్రాంతంలో ఆహారానికి సరిపడా వన్యప్రాణులు, తాగునీరు, సేద తీరేందుకు అనువైన అటవీ ప్రాంతం పెద్ద పులులను సాదరంగా ఆహ్వానించింది.
ఇవన్నీ కలిసొచ్చాయని : మహారాష్ట్రల్లోని తాడోబా, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వుల్లో పులుల సంఖ్య ఎక్కువైంది. అక్కడ ఆహార కొరత ఉండడంతో గోదావరి, ప్రాణహిత తీర ప్రాంతాలు దాటి మనవైపు వస్తున్నాయని అటవీ అధికారులు తెలిపారు. ఇక్కడి అడవుల్లో శాకాహార జంతువులు అధికంగా ఉండడం, పచ్చదనం ఎక్కువ ఉండడంతో కలిసివస్తోంది.
పాదముద్రల ఆనవాళ్ల ఆధారంగా : ఛత్తీస్‌గఢ్ కీకారణ్యం నుంచి పెద్దపులి వరంగల్‌లోకి ప్రవేశించింది. ములుగు జిల్లా వెంకటాపురం మండరం చెలిమల, డోలి అభయారణ్యం మీదుగా కొత్తుగుంపు, బోదాపురం అటవీ మార్గంలో గోదావరి తీర ప్రాంతంలోకి చేరుకున్నట్లు అటవీశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఇక్కడి పాదముద్రల ఆనవాళ్ల ఆధారంగా ఆ మార్గమే రాకకు సులువైందని నిర్ధారించారు.
బోదాపురం సమీప పెద్దలంక భూముల్లో సాగు చేస్తున్న పుచ్చపంటల గుండా దాదాపు ఐదుకు పైగా చిన్నపాటి పాయలు దాటి గోదావరి ప్రవాహం వైపు వెళ్లింది. ఆ నదిని సైతం దాటినట్లు ఆవలి ప్రాంతమైన మంగపేట మండలం చుంచుపల్లి, రాజుపేట ప్రాంతాల్లో పెద్దపులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు.
ఎప్పుడొస్తుందో? - ఏ వైపు నుంచి దాడి చేస్తుందో? - పెద్దపులి ఆచూకీ లభించక బిక్కుబిక్కుమంటున్న ప్రజలు
ఈ ప్రాంతంలో సంచరిస్తుంది మగ పులిగా అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. పాదముద్రల ఆనవాళ్లు పరిశీలించిన వారు పులికి 6ఏళ్ల వయస్సు పైబడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కొత్త ఆవాసం, ఆహారం, తోడు కోసం పులి ప్రతిరోజు 40 నుంచి 60కి.మీ ప్రయానిస్తుందని తెలిపారు.
"నేను సేద్యం చేస్తున్న సమంలో పుచ్చపంట వద్ద పాత్రి కాపాలకు వెళ్లాను. రాత్రి 9.15 గంటల సమయంలో టార్చ్‌లైట్ వేసి చూస్తే పులి కనిపించింది. గుడిసెకు కేవలం వంద మీటర్లలోపే పులి సంతరించి పోయింది." - నర్సింహరావు, రైతు
పెద్దపులి సంచరిస్తున్నందున తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎఫ్‌ఆర్‌వో చంద్రమౌళి తెలిపారు. వెంకటాపురం అటవీ క్షేత్రం పరిధిలోని యంత్రాంగంతో నాలుగు బృందాలను ఏర్పాటు చేసి ఏ మార్గంలో వెళ్లిందో గుర్తించే ప్రక్రియను చేపట్టినట్లు వివరించారు. పులికి ఎలాంటి హాని తలపెట్టకుండా వేటగాళ్లపై నిఘా ఉంచుతామన్న ఆయన కెమెరా ట్రాప్స్ ఏర్పాటుకు ప్రణాళిక చేస్తున్నామని తెలిపారు.
ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- పెద్దపులి సంచరించిన తీరం వైపు ఎవ్వరూ ఒంటరిగా వెళ్లరాదు.
- గుంపులుగా చేతిలో కర్రలతో తిరగాలి
- సమీప అడువుల్లో మూగజీవాలను మేతకు వదలకూడదు
- పంటల్లో పనికి వెళ్లినప్పుడు గుంపులుగా వెళ్లాలి.
- పులి కనిపిస్తే అస్సలు పరుగెట్టకూడదు, ఎదురుగా వచ్చినా ధైర్యంగా ఉండాలి. ట
- తల వెనుక నుంచి మాస్కులు పెట్టుకోవడంతో పులి గమనింపులో మార్పులు వస్తాయి.
- సాయంత్రం 5గంటల లోపు నివాసాలకు చేరుకోవాలి.
వెంటాడుతున్న 'పులి' భయం - ఆ వైరల్ వీడియోలతో భయం భయంగా గడుపుతున్న జనం
భర్త ప్రాణాల కోసం పులినే ఎదిరించిన భార్య - భయంతో పరుగులు పెట్టిన వ్యాఘ్రం