Family Attempts Suicide in Hotel in Secunderabad : ఆ జంటకు పెళ్లయి ఎనిమిది నెలలు కూడా కాలేదు. విబేధాల కారణంగా ఇటీవలే ఆమె తన భర్త, అత్తమామలపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీనికి భయపడి ఆ కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు ప్రయత్నించిన వైనమిది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఓ హోటల్‌లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సికింద్రాబాద్ మహంకాళి పోలీసుస్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగోల్‌కు చెందిన పద్మావతి, భావనారాయణ దంపతుల ఏకైక కుమారుడు సుజన్. అతను ఓ ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
కొత్తగూడెం సమీపంలోని చుంచుపల్లికి చెందిన యువతితో ఈ ఏడాది ఫిబ్రవరి 14న అతడికి వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో కొద్దిరోజులకే అత్తింటివారితో మనస్పర్థల కారణంగా కోడలు పుట్టింటికి వెళ్లిపోయింది. ఇటీవల భర్త, అత్తమామలపై కోడలు చుంచుపల్లి పోలీసుస్టేషన్‌లో గృహహింస కేసు పెట్టింది. దీంతో అరెస్టవుతామన్న భయంతో వారు ఈ నెల 5న ఇల్లు వదిలి సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. బుకింగ్ చేసుకున్న ప్రకారం మంగళవారం ఉదయం ఖాళీ చేయాలి.
కానీ ఇంకా రూం ఖాళీ చేయకపోవడంతో సిబ్బందికి అనుమానం వచ్చి మరో తాళంతో గది తలుపు తీశారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్నట్లు హోటల్ సిబ్బంది గుర్తించి వెంటనే పోలీసులకు తెలిపారు. అనంతరం ముగ్గురిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. జ్యూస్‌లో నిద్రమాత్రలు కలుపుకొని తాగడంతోపాటు ఇన్సులిన్ ఇంజెక్షన్లు కూడా తీసుకున్నట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు వెల్లడించారు.
ఆత్మహత్యాయత్నానికి ముందు వీడియో కాల్ : భావనారాయణ దంపతులు సోమవారం రాత్రి కోడలికి వీడియో కాల్ చేసి, కేసు వాపసు తీసుకోవాలంటూ బతిమిలాడినట్లు తెలుస్తోంది. ఆమె దీనికి ఒప్పుకోకపోవడంతోనే బలవన్మరణానికి ప్రయత్నించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి సంబంధించిన ఫొటోలను కూడా కోడలికి పంపినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం - విషయం తెలిస్తే షాక్ తప్పదు?
పాపం ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో - కుమారుడిని చంపి - ఆపై తానూ ఆత్మహత్య