Low Pressure In The Bay Of Bengal : ఉపరితల ఉష్ణోగ్రతలు, ఇతర వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో బంగాళాఖాతంలో వెనువెంటనే అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ఈ నెల 7న ఒకటి ఏర్పడింది. అది తీవ్ర అల్పపీడనంగా బలపడింది. దీని ప్రభావంతో తమిళనాడు రాష్ట్రంతో పాటు ఏపీలోని ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. సోమవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. 2 రోజుల్లో మరింత బలపడి తమిళనాడు రాష్ట్ర తీరం వైపు ప్రయాణించనుంది. దీని ప్రభావంతో మంగళవారం, బుధవారాల్లో తమిళనాడు, ఏపీ లోని ఉమ్మడి ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉంది. ఈ అల్పపీడనం వాయుగుండంగానూ రూపాంతరం చెందుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అది తీరాన్ని తాకిన వెంటనే ఈ నెల 17న అండమాన్ పరిసరాల్లో మరో అల్పపీడనం ఏర్పడ వచ్చని ఐరోపాకు చెందిన మోడల్ సూచిస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన చలి తీవ్రత : ఉత్తర భారతంలో వీస్తున్న చలిగాలుల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు జిల్లాలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయాయి. కర్నూలు,అనంతపురం, చిత్తూరు, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో 18 డిగ్రీల కంటే తక్కువగా, ఏజెన్సీ ప్రాంతాల్లో 16 డిగ్రీల కంటే దిగువన ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. శుక్రవారం రాత్రి అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం కుంతలం గ్రామంలో అత్యల్పంగా 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. సోమ, మంగళవారాల్లో అరకు, సాలూరు తదితర ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పది డిగ్రీల కంటే తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉంది.
ALERT : బంగాళాఖాతంలో అల్పపీడనం - కోస్తా, రాయలసీమకు భారీ వర్షసూచన
వెనువెంటనే అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి : ఈశాన్య రుతు పవనాలు చురుకుగా కదులుతుండటం, థాయ్‌లాండ్ పరిసరాల్లో పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో వెనువెంటనే అల్పపీడనాలు ఏర్పడుతున్నాయని ఐఎండీ పూర్వ డైరెక్టర్ జనరల్ కేజే రమేశ్ తెలిపారు. వీటి ప్రభావంతో ఈ నెల చివరి వరకు ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవొచ్చని పేర్కొన్నారు. రేపు ఏర్పడనున్న అల్పపీడనం తీరానికి దగ్గరగా వస్తే చలి తీవ్రత కొంత తగ్గుతుందని అన్నారు.
రెయిన్ అలర్ట్ : బంగాళాఖాతంలో అల్పపీడనం - తుపానుగా మారే ఛాన్స్ - రాబోయే 3 రోజుల్లో వర్షాలు