Brokers Tried to sell Land with Fake Documents in Sangareddy : సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ ప్రభాకర్‌రెడ్డికి చెందిన రూ. 22.23 కోట్ల విలువ చేసే 57 ఎకరాల భూమిని కొందరు దళారులు ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఏకంగా అమ్మకానికి పెట్టారు. ఆ భూమిని ఓ బిల్డర్‌కు విక్రయించేందుకు ప్రయత్నించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
భూమిని విక్రయించాలని : సంగారెడ్డి జిల్లా అందోల్ గ్రామానికి చెందిన శేరి నరసింహారెడ్డి, అంజమ్మ, బాలకృష్ణారెడ్డి, సైబరాబాద్ మాజీ కమిషనర్ ప్రభాకర్ రెడ్డిలకు కలిసి ఒకే దగ్గర 57 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని విక్రయించేందుకు వారు పట్టాదారు పాసు పుస్తకాలు, ఆధార్ కార్డులను తెలిసిన వారికి వాట్సాప్ చేశారు. అలా ఆ డాక్యుమెంట్స్ వాట్సాప్ సర్క్యూలేషన్ ద్వారా నారాయణఖేడ్‌కు చెందిన రవీందర్‌కు వెళ్లాయి. దీంతో రవీందర్ అతని స్నేహితుడు సుధాకర్, మరో రియల్ ఎస్టేట్ సంజీవరెడ్డితో కలిసి ఆ భూమిని విక్రయించాలని పన్నాగం పన్నారు.
ఇందులో భాగంగా దళారులు పట్టాదారు పాసు పుస్తకాలు, ఆధార్ కార్డుల కలర్ జిరాక్స్ తీసి నకిలీ పత్రాలు సృష్టించారు. ఎకరానికి రూ.39 లక్షల చొప్పున ఫేక్ అగ్రిమెంట్ సేల్ డాక్యుమెంట్ సైతం సిద్ధం చేసుకున్నారు. అసలైన పట్టాదారులు విక్రయించినట్టుగా నకిలీ పత్రాలు సృష్టించారు. ఈ నేపథ్యంలో దళారి సుధాకర్ హైదరాబాద్‌లో ఎల్లయ్య అనే వ్యక్తికి భూమిని విక్రయించే విషయాన్ని తెలిపారు. దీంతో ఎల్లయ్య వారికి బిల్డర్ యాదగిరి రెడ్డిని పరిచయం చేశారు. ఆ బిల్డర్ డాక్యుమెంట్లను పరిశీలించి నిజమేనని నమ్మి ఆ 57 ఎకరాల భూమిని ఎకరానికి రూ. 40 లక్షల చొప్పున అగ్రిమెంటు చేసుకున్నాడు. అందులో భాగంగా 11 లక్షల రూపాయలను అడ్వాన్స్‌గా ఇచ్చారు.
అసలు పట్టాదారుల రాకతో బయట పడిన అసలు విషయం : ఈ క్రమంలో ప్లాట్ రిజిస్టర్ చేయాలని బిల్డర్ యాదిగిరి రెడ్డి దళారులపై ఒత్తిడి తెచ్చాడు. రెండు మూడు నెలలు అవుతున్న వారు రిజిస్టర్ చేయకపోవడంతో అనుమానం వచ్చింది. దీంతో నేరుగా పత్రాలను తీసుకొని అందోల్ గ్రామానికి వచ్చి భూములను పరిశీలించే క్రమంలో అసలు పట్టాదారులు బిల్డర్ యాదిగిరి రెడ్డిని ప్రశ్నించారు. భూములను ఎందుకు పరిశీలిస్తున్నారని అడిగారు.
దీంతో ఆ బిల్డర్ ఈ భూమిని తాము ఎకరానికి రూ. 40 లక్షల చొప్పున అగ్రిమెంట్ చేసుకున్నామని పత్రాలను చూపించారు. అసలు పట్టాదారులు ఆ అగ్రిమెంట్లో ఉన్న సంతకాలు చూసి ఇవి తాము చేసిన సంతకాలు కావని, ఫేక్ డాక్యుమెంట్ సృష్టించారని బిల్డర్‌కు తెలిపారు. ఈ మేరకు బాధితులు వెంటనే సంగారెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో జోగిపేట ఎస్సై ఆ కేసును ఛేదించి నారాయణఖేడ్‌కు చెందిన రవీందర్, సుధాకర్, సంజీవరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.