Ratnalayam Temple Robbery Case: దేవాలయాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.70లక్షల విలువ చేసే బంగారు, పంచలోహ ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో మేడ్చల్ డీసీపీ ఎన్.కోటిరెడ్డి వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: శామీర్‌పేట్ మండలం అలియాబాద్ గ్రామ శివారు రాజీవ్ రహదారి పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి(రత్నాలయం)లో ఈ నెల 24న అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. దేవాలయం వెనుక భాగం నుంచి లోపలికి ప్రవేశించి విలువైన బంగారం, వెండి, కాంస్య విగ్రహాలను ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది.
కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు శామీర్‌పేట్, జీనోమ్ వ్యాలీ, ఎస్ఓటీ, సీసీఎస్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. దాదాపు 400 సీసీ కెమెరాల ఫుటేజీలను తనిఖీ చేశారు. దుండగులు ఓ రోజు రాత్రంతా వాహనాలపై తిరుగుతూ తెల్లవారుజామున ఒకచోట అనుమానాస్పదంగా తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించారు.
ఇళ్లకు తాళాలు వేసి ఉంటే వాళ్లకు పండగే- అర్ధరాత్రి ఆరు ఇళ్లలో హవా - Mid Night Robbery In Nellore
మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయకు చెందిన అనిల్, మేడ్చల్ పట్టణానికి చెందిన చింతాడ రాజు, రాంనగర్ చెందిన అస్లాం అలీ, షరీఫ్‌కు ఈ చోరీతో సంబంధం ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వీరిలో అనిల్, రాజు దేవాలయంలో చోరీ చేసిన వస్తువులను అస్లాం, షరీఫ్‌కు అమ్మారు. వారిపై నిఘా పెట్టిన పోలీసులు మేడ్చల్ మండలం మున్షీరాబాద్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
ఆభరణాలు స్వాధీనం: నిందితుల నుంచి అమ్మవారి బంగారు లాకెట్, వెండి మంగళసూత్రాలు, వెండి ఖడ్గం, శఠగోపం, దండకం, కిరీటాలు, వడ్డాణం, నాగపడిగ, పంచలోహంతో తయారు చేసిన శ్రీదేవి భూదేవి శ్రీనివాస ఉత్సవమూర్తి విగ్రహాలు నాలుగు, సుదర్శన చక్రం ఒకటి స్వాధీనం చేసుకున్నారు. 80 వేల నగదు, నాలుగు సెల్ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.
13 దేవాలయాల్లో చోరీలు : గత మూడు నాలుగు నెలలుగా వీరు షామీర్పేట్, మేడ్చల్, జినోమ్ వ్యాలీ, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని 13 దేవాలయాల్లో చోరీకి పాల్పడ్డారు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న నిందితులను ఎట్టకేలకు రత్నాలయం కేసులో పట్టుకున్నారు. ముగ్గురు నిందితులు పట్టుబడగా, షరీఫ్ పరారీలో ఉన్నాడు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని డీసీపీ అభినందించారు.
"దర్గయ్యా ఎంతపని చేశావయ్యా"- భార్యను చూసేందుకు వెళ్లడానికి బస్సునే కొట్టేశాడు - Bus Robbery