A Tiger Roams The Forest in Sircilla District : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని మల్కాపూర్ గుట్టల్లో పెద్దపులి సంచారం స్థానికులను తీవ్రంగా కలవరపెడుతోంది. పెద్దపులి తిరుగుతోందని తెలియడంతో ప్రజలు అందరూ భయాందోళనకు గురవుతున్నారు. రబీ కోసం వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండగా రైతులకు పెద్ద శబ్దాలతో పులి గాండ్రింపులు వినిపించాయి. దీంతో వెంటనే వారు అప్రమత్తమయ్యారు.
పెద్దపులి కనిపించిందన్న రైతులు : మళ్లీ అనుమానం వచ్చి సరిగ్గా పులి గాండ్రింపులు వచ్చిన వైపు చూసిన రైతులు మల్కాపూర్ గుట్టల రాళ్ల మధ్యన పెద్దపులి ఉన్నట్లు తెలుసుకున్నారు. కొంతమంది స్థానికులకు పులి తిరుగుతూ ఉండటం కనిపించిందని చెబుతున్నారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పశువులను పొలాల దగ్గర నుంచి ఇళ్లకు తరలించారు. అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి పులి గుర్తులను గుర్తించారు. వెంటనే గస్తీ బృందాన్ని ఏర్పాటు చేసి స్థానికులకు పలు సూచనలు జారీ చేశారు.
తాత్కాలిక స్థావరం ఏర్పాటు చేసుకున్న పులి : గత వారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో సంచరించిన పెద్దపులి సమీప అడవులు, గుట్టల్లో తాత్కాలిక స్థావరం ఏర్పాటు చేసుకున్నట్లు అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. స్థానికులెవరూ పెద్దపులి బారిన పడకుండా సమీప గ్రామాల్లో చాటింపు చేస్తున్నారు. రైతులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే వ్యవసాయ పనులు చూసుకోవాలని అన్నారు. ఒకవేళ అత్యవసరం అనుకుంటే కొంతమంది కలిసి గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించారు. పశువులను ఎట్టి పరిస్థితుల్లో పొలాల వద్ద ఉంచొద్దని కోరారు. ఫారెస్ట్ అధికారులు బోన్లు ఉపయోగించి వీలైనంత త్వరగా పులిని పట్టుకోవాలని మల్కాపూర్ వాసులు కోరుతున్నారు.
అమ్మ బాబోయ్ పెద్దపులి - కంటిమీద కునుకులేకుండా గడుపుతున్న నల్లబెల్లి వాసులు