High Temperatures in Telangana : రాష్ట్రంలో భానుడి భగభగలు రోజురోజుకూ మరింతగా పెరిగిపోతున్నాయి. మునుపటి కంటే ఎక్కువగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ రాష్ట్రంలో అత్యంత వేడి దినంగా రికార్డయ్యింది. గరిష్ఠంగా సూర్యాపేట జిల్లా మునగాల, ఖమ్మం జిల్లా పమ్మి, జగిత్యాల జిల్లా నేరెళ్ల, పెద్దపల్లి జిల్లా మంథనిలో 46.7 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యింది. మరికొన్ని జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా ఉదయం పది గంటల నుంచే ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి కనిపించటం లేదు. మధ్యాహ్న సమయంలో భానుడి భగభగలతో జన సంచారం తగ్గి రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. వచ్చే రెండు రోజుల పాటు కూడా 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలే నమోదవుతాయని, పొడుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచించింది.
ఉమ్మడి నల్గొండ జిల్లాపై భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉమ్మడి జిల్లాలో నమోదయ్యాయి. భానుడి ప్రతాపంతో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సూర్యాపేట జిల్లా మునగాలలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.7 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ జిల్లా కామారెడ్డిగూడెంలో 46.6 ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ జిల్లాలోని 29 ప్రాంతాల్లో 45.0 పైన ఉష్ణోగ్రతలు నమోదు కాగా, సూర్యాపేట జిల్లాలో 17 ప్రాంతాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 ప్రాంతాల్లో 45.0 పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి ప్రాంతంలో భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక్కడి ప్రాంతంలో బొగ్గుగనులు, థర్మల్ కేంద్రాలు ఉండటంతో వడగాలులు మరింత ఉద్ధృతంగా వీస్తున్నాయి. విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు మండించే ప్రక్రియ జరుగుతుండటంతో ఉష్ణోగ్రతలు సుమారు 10 కిలోమీటర్ల మేరకు వ్యాపిస్తున్నాయి. పరిసర గ్రామాల ప్రజలు రోడ్లపైకి రావాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు.
మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజలకు ఎండల నుంచి కాస్త ఉపశమనం లభించింది. సాయంత్రం దాదాపు గంటసేపు ఉరుములు మెరుపులు ఈదురగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుభాష్ నగర్ కాలనీలో ఒక భారీ వృక్షం కారుపై పడటంతో కారు ధ్వంసం అయింది. బీసీ బాలికల వసతి గృహం పక్కన ఉన్న పెద్ద చెట్టు ప్రధాన రహదారిపై పడటంతో పంచాయతీ సిబ్బంది చెట్టును తీసివేశారు. ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చే విద్యుత్ స్తంభాలు రహదారిపై పడిపోయాయి. గత కొన్నిరోజులుగా భానుడి భగభగలకు ఇబ్బందులు పడుతున్న తమకు, ఇవాళ కురిసిన వర్షంతో ఉపశమనం లభించిందని స్థానికులు పేర్కొంటున్నారు.